CM Jagan planning a bus yatra: జనాల దగ్గరకు జగన్.. టీడీపీకి ఇక చుక్కలేనా ?
ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ 2019కి ముందు జగన్ చేసిన విన్నపానికి జనం సూపర్బ్ గా రియాక్ట్ అయ్యారు. వైసీపీకి అద్భుతమైన మెజారిటీ అందించి.. అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నవరత్నాల మీదే దృష్టి పెట్టిన జగన్.. వాటి అమలు కోసం చాలా కష్టపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమం ఆగకూడదు అనుకున్నట్లు కనిపిస్తున్నారు.
ఐతే ఈ ప్రాసెస్ లో ఆయన జనాలకు, పార్టీకి దూరం అవుతున్నారు. సభలో, సమావేశాల్లో కనిపించడం తప్ప.. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా జనాల్లో కలిసినట్లు కనిపించడం లేదు. ఇదే టీడీపీకి ఆయుధంగా మారింది కూడా ! ప్యాలెస్ సీఎం అంటూ లోకేశ్ పదేపదే జగన్‌ను టార్గెట్ చేస్తూ కనిపిస్తున్నారు ఈ మధ్య ! అటు పార్టీలోనూ పరిస్థితులు నెమ్మదిగా చేయి దాటుతున్న పరిస్థితి. అసంతృప్తులు, వర్గపోరు, ఆధిపత్య పోరు.. ఇలా వైసీపీ ముక్కలు అవుతోంది. ఇది టీడీపీకి మరింత బలంగా మారుతోంది.
ఇలాంటి సమయంలో రంగంలోకి దిగేందుకు జగన్ సిద్ధం అయ్యారు. పార్టీని సెట్ రైట్ చేయడంతో పాటు.. జనాలకు మరింత చేరువయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. లెక్కేస్తే ఎక్కువ రోజులు వినిపించినా.. ఓ రాజకీయ పార్టీకి ఇది చాలా తక్కువ సమయం. దీంతో జనంలోకి వెళ్లేందుకు జగన్ ప్లాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఆయన నేరుగా జనాలను కలుసుకుంటారని.. వారితో కలిసి పల్లె నిద్ర చేస్తారని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి బస్సు యాత్రకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రతీ మండలంలో ఒకట్రెండు పల్లెలను ఎంచుకుని అక్కడే జనాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. నాలుగేళ్ల పాలనలో ఎన్నికల మ్యానిఫెస్టో అమలు, మిగిలిపోయిన వాటి అమలుపై జనాల ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. గతంలో పాదయాత్ర సందర్భంగా బస చేసినట్టుగానే… బస్సు యాత్రలో కూడా అదే రీతిలో ఆయన జనాలతో గడుపుతారని తెలుస్తోంది.
ఇక అదే సమయంలో పార్టీలో లుకలుకలకు కూడా బ్రేక్ వేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. దాదాపు ప్రతీ జిల్లాలో పార్టీలో విభేధాలు వెంటాడుతున్నాయ్. కొన్ని నియోజకవర్గాల్లో అయితే.. వైసీపీలో నాలుగైదు గ్రూపులుగా కనిపిస్తున్నాయ్. ఐతే ఇంత జరుగుతున్న దృష్టి సారించడం లేదన్న ప్రచారానికి జగన్ చెక్ పెట్టబోతున్నారు. ఓ వైపు జనాలకు కలుసుకుంటూనే.. మరోవైపు అసంతృప్త నేతలను కూల్ చేయడం.. వర్గపోరుకు చెక్ పెట్టడం.. క్షేత్రస్థాయి కేడర్లో బలం నింపేందుకు.. జనాల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధం అవుతున్నారు. ఇదేం కర్మ అంటూ చంద్రబాబు ఇప్పటికే యాత్రలు చేస్తున్నారు.. లోకేశ్ యువగళంలో భాగంగా జనాలను కలుసుకుంటున్నారు. వారాహి ఇంజిన్ స్టార్ట్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నారు. ఇప్పుడు జగన్ కూడా జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఏపీ రాజకీయం మరింత ఆసక్తిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.