CM kcr: మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్నారా ?
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి.. ఢిల్లీపై దండయాత్ర మొదలుపెట్టిన కేసీఆర్.. ఒక్కో అడుగు ఆచీతూచీ వేస్తున్నారు. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ.. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్ర మీద ఎక్కువ నజర్ పెట్టినట్లు కనిపిస్తున్నారు.
ఇప్పటికే రెండు భారీ సభలు నిర్వహించిన కేసీఆర్.. ఆ రాష్ట్రంలో కీలక నేతలను పార్టీలో చేర్చుకున్నారు. కేసీఆర్ చూపు ఎక్కువ మహారాష్ట్ర మీదే కనిపిస్తోందని క్లియర్‌గా అర్థం అవుతోంది. దేశంలో అతిపెద్ద రాష్ర్టాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ 48 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయ్. ఎక్కువ సంఖ్యలో రైతులు ఉండటం.. అంతకుమించి తెలంగాణ సరిహద్దు రాష్ట్రం కావడంతో.. మహారాష్ట్ర మీద కేసీఆర్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడో కొత్త ప్రచారం.. రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
2024 ఎన్నికల్లో కేసీఆర్ పార్లమెంట్‌కు పోటీ చేయబోతున్నారని.. అది కూడా మహారాష్ట్ర నుంచి బరిలో దిగబోతున్నారనే వార్తలు తెగ షికారు చేస్తున్నాయ్. ఔరంగాబాద్ లేదా నాందేడ్ నుంచి కేసీఆర్ పోటీకి దిగుతారనే ప్రచారం నడుస్తోంది. ఈ రెండు పార్లమెంట్ స్థానాలు కూడా తెలంగాణ సరిహద్దు జిల్లాలు కావడంతో.. ఈ ప్రచారానికి మరింత చేకూరుతోంది. ఇప్పటికే పార్టీ నేతలకు ఈ సమాచారం అందించారని.. దానికి తగిన ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి స్పెషల్ టీమ్ రంగంలోకి దిగి.. వివిధ పార్టీల నేతలను, కార్యకర్తలను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఔరంగాబాద్‌లో ముస్లిం ఓటర్లు ఎక్కువ. మజ్లిస్ పార్టీకి చెందిన ఎంపీ.. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ ఎలాగూ దోస్తీలో ఉన్నాయ్ కాబట్టి.. తెలంగాణలో ముస్లిం జనాభా ఉన్న సీటును మజ్లిస్‌కు విడిచిపెట్టి.. ఔరంగాబాద్ స్థానం నుంచి తాను పోటీ చేయాలని కేసీఆర్ చూస్తున్నారనే డిస్కషన్ నడుస్తోంది. ఇక నాందేడ్‌లో కేసీఆర్ పోటీకి దిగితే.. సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. పార్టీ జరిపించిన సర్వేలో తేలింది. ఔరంగబాదు కుదరకపోతే.. నాందేడ్ నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారని మరికొందరు అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత.. తెలంగాణ వదిలి మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి మరి !