CM kcr: ఈటలపై కోపంతో.. మొత్తం ముదిరాజ్ లకే టికెట్ లేకుండా చేశారా కేసీఆర్ ?
ఈసారి బీఆర్ఎస్ నుంచి ఒక్క టికెట్ కు కూడా నోచుకోని ఆ సామాజిక వర్గమే ‘ముదిరాజ్’ ! ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉండగా ముదిరాజ్ లకు పార్టీలో మంచి ప్రాధాన్యం లభించింది.
ఈసారి కేసీఆర్ పార్టీ నుంచి ఓ కులానికి ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా దక్కలేదు. ఆ కుల సంఘాల నేతలు కేసీఆర్ ను కలిసి తమ కులానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లకు కనీసం ఐదు టికెట్లయినా కేటాయించాలని కోరారు. అయినా ఫలితం దక్కలేదు. సాధారణంగా ప్రతీ వర్గాన్ని పార్టీతో కలుపుకొని ముందుకుసాగే కేసీఆర్ ఆ ఒక్క కులం విషయంలో మాత్రం ఎందుకంత దూరం పాటించారు ? అంటే.. సమాధానంగా ఒక లీడర్ పేరు వినవస్తోంది. ఆయనే .. ‘ఈటల రాజేందర్’ ! ఈసారి బీఆర్ఎస్ నుంచి ఒక్క టికెట్ కు కూడా నోచుకోని ఆ సామాజిక వర్గమే ‘ముదిరాజ్’ ! ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉండగా ముదిరాజ్ లకు పార్టీలో మంచి ప్రాధాన్యం లభించింది. కానీ ఆ తర్వాతి నుంచి ప్రయార్టీని తగ్గించారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలోని దాదాపు 60 లక్షల మంది ముదిరాజులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని ముదిరాజ్ సంఘాలు అంటున్నాయి. తామంతా భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటామని చెబుతున్నాయి. ఈ పరిణామం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ పాయింట్ గా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా స్ట్రాంగ్ అయిన కాంగ్రెస్ పార్టీ వైపునకు ముదిరాజ్ లు చేరితే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెందిన చాలా అసెంబ్లీ సీట్లు గల్లంతయ్యే ముప్పు ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల వెంటే వెళ్తారని..
హుజూరాబాద్ బై పోల్ లో ఈటల రాజేందర్ విజయంలో ముదిరాజ్ లు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీజేపీలోనూ ఈటలకు ప్రయారిటీ దక్కడానికి ఆయన వెంట ఉన్న ముదిరాజ్ వర్గమే కారణమని కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్ వర్గం పూర్తిగా బీజేపీ వైపే వెళ్లే ఛాన్స్ ఉందని గులాబీ బాస్ అంచనా వేస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి ఇతర వర్గాలపై ఫోకస్ చేయడం మంచిదని బీఆర్ఎస్ డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్క వ్యక్తి కోసం 60 లక్షల మందితో కూడిన ఓ బలమైన వర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేసుకోవడం పెద్ద పొరపాటని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవడం అనేది ప్రస్తుతం బీఆర్ఎస్ ముందున్న మొదటి మార్గం. ముదిరాజ్ వర్గం నేతలకు మరేదైనా విధంగా ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇవ్వడం రెండో మార్గం. ఈ రెండు మార్గాలను వద్దనుకొని.. భేషజాలకు పోతే ముదిరాజ్ ఓటుబ్యాంకు అత్యధికంగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కారు పార్టీకి ఎదురుగాలి వీయడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కులాలవారీగా బీఆర్ఎస్ ప్రయారిటీ ఇదీ..
115 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ రిలీజ్ చేసిన మొదటి జాబితాలోని సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే.. అత్యధికంగా ఓసీ వర్గానికి 58 సీట్లు దక్కాయి. ఈ వర్గం నుంచి ఎంపికైన వారంతా అత్యంత సంపన్నులే కావడం గమనార్హం. ఓసీలకు దక్కిన 58 టికెట్లలో 40 టికెట్లు రెడ్డి వర్గం వారే పొందారు. ఇక బీసీ వర్గానికి కేవలం 22 టికెట్స్ ఇచ్చారు. అయితే ఇందులో అత్యధికంగా 10 సీట్లను ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉన్న మున్నూరు కాపులకు ఇచ్చారు. యాదవులకు ఐదు, గౌడ్స్ కు 4, బెస్తలకు 1, వంజరలకు 1, పద్మశాలీలకు 1 టికెట్ ను కేసీఆర్ కేటాయించారు. 2018తో పోలిస్తే బీసీలకు ఈసారి 2 టికెట్లు ఎక్కువగానే కేటాయించినప్పటికీ.. ముదిరాజ్ లకు అవకాశం కల్పించలేదు.