Telangana Election: నామినేషన్ కు దివ్యమైన ముహూర్తాలు నాలుగు.. దరఖాస్తుకు ఏర్పాట్లు చేసుకుంటున్న అభ్యర్థులు
తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ తేదీ నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభం వరకూ అన్నింటికీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నాలుగు ముహూర్తాలు బ్రహ్మండంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం సిద్దమౌతున్నారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆ రోజుటి నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తమ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియను చాలా సెంటిమెంట్ గా భావిస్తారు కొందరు నేతలు. అందులో భాగంగా వారికి ఇష్టదైవమైన ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఆ తరువాత ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నామినేషన్ ప్రక్రియలో ముహూర్తాన్ని బలంగా నమ్ముతారు. బీ ఫాం తీసుకున్నప్పటి నుంచి దానిని ప్రభుత్వ అధికారులకు అందించే వరకూ అన్నింటా మంచి రోజులు, శుభసమయాలు, తిథి, వార, నక్షత్రాలు చూసుకుంటారు.
ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కి సంబంధించిన నామినేషన్ తేదీని అధికారికంగా ప్రకటించింది పార్టీ కార్యాలయం. నవంబర్ 3వ తేదీన నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవడంతో 9న కేసీఆర్ రెండు చోట్ల నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. ఆయన సెంటిమెంట్ గా భావించే సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి శీ వేంకటేశ్వరస్వామి గుడిలో ఉదయం ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత ఉత్తర నక్షత్రంతో కూడిన రోజున అమృత గడియల్లో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఆయన జన్మ నక్షత్రం ప్రకారం నవంబర్ 9 బ్రహ్మండంగా ఉందని పండితులు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే అదే రోజు కామారెడ్డిలో భారీ బహిరంగ సభకూడా ఏర్పాటు చేశారు.
ఈ జాతకాలు, నక్షత్రాలు పాటించడంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరూ తమ తమ పేరు బలాలను బట్టి ఆయా తేదీల్లో నామినేషన్ వేసేందుకు సిద్దమౌతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా సిద్దం చేసుకుంటున్నారు. దీనిపై పండితులు కొన్ని ముఖ్యమైన ముహూర్తాలను సూచించారు. ఇవి ఏ నక్షత్రం వారికైనా సరిపోతాయంటున్నారు. నవంబర్ 3 నుంచి 10 తేదీ లోపూ నామినేషన్లు వేయాల్సి ఉన్నందున ఆ వారం రోజుల్లోని అద్భుతమైన ముహూర్తాలను వెల్లడించారు. నవంబర్ 3,4,8,9 ఈ నాలుగు తేదీలు దివ్యంగా ఉన్నట్లు చెబుతున్నారు. వీటిలో శుభ తిథి, తారాబలం బాగా కలిసి వచ్చిందంటున్నారు పౌరోహితులు. దీంతో నేతలంతా ఆలయాలకు ప్రత్యేక పూజలు చేసేందుకు తమ నామినేషన్ వేసేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. సమయం తక్కువ ఉండటంతో పాటూ ఇంట్లో పరిస్థితులు సరిచూసుకుని ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున మరి కొందరిలో ఆందోళన కూడా మొదలైంది.
T.V.SRIKAR