Doctor Bharathi: సాకే భారతికి సాగు భూమి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..
సాకే భారతి గత పక్షం రోజులుగా ఈమె ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఈమె చేసిన పని చాలా మందికి ఆదర్శం అయింది. కూలిపని చేస్తూ పీ హెచ్ డీ పట్టాపొంది పేదరికం కావద్దు సంకల్పానికి అడ్డు అని నిరూపించారు. ఈమె చెంతకు మీడియా చానళ్లు మొదలు ప్రభుత్వ అధికారలు పరామర్శించేందుకు, గౌరవ సత్కారాలు అందించేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది.

Collector Gauthami gave the two acre farm sanctioned by the AP government to Saake Bharti, a Ph.D
అనంతపురం జిల్లా శింగనమల మండలానికి చెందిన డాక్టర్ సాకే భారతికి జిల్లా కలెక్టర్ గౌతమి రెండు ఎకరాల భూమి పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిపాలనాధికారి మాట్లాడుతూ పొలంలో కూలిపని చేస్తూ శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో పీ హెచ్ డీ పట్టా పొందడం మామూలు విషయం కాదు. మన జిల్లాకే గర్వకారణం అని కొనియాడారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో తాను అనుకున్నాది సాధించారని కీర్తించారు.
ఈ సందర్బంగా డాక్టర్ భారతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ఎకరాల పొలాన్ని మంజూరు చేసింది. సోదనపల్లి గ్రామంలో సర్వే నంబరు 9-12 లో వ్యవసాయానికి అనుకూలమైన భూమిని భారతికి ఇచ్చామని కలెక్టర్ గౌతమి తెలిపారు. ప్రస్తుతం ఈమె ఉన్న ఇంటిని పరిశీలించామని.. అరకొర సౌకర్యాలతో ఉన్న ఈ ఇంటిని మంచిగా నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ జూనియర్ లెక్చరర్ పోస్ట్ కాళీగా ఉంది. ఆమె ఇందులో పనిచేసేందుకు సిద్దంగా ఆసక్తిగా ఉంటే ఆ ఉద్యోగం ఈమెకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం ఇలాంటి వారికి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు.
T.V.SRIKAR