World War III : మూడో ప్రపంచయుద్ధం రాబోతోందా…?
అగ్రదేశాల ఆధిపత్య చదరంగంలో ఉక్రెయిన్ పావుగా మారిపోయింది. ఇప్పుడు దాని చేతిలో ఏమీ లేదు... చైనా, రష్యా, అమెరికాలు వేసే ఎత్తులను చూస్తూ కాలప్రవాహంలో కొట్టుకుపోవడమే...
మూడో ప్రపంచయుద్ధం తప్పదా…? అతి త్వరలోనే మరో ప్రచ్ఛన్నయుద్ధాన్ని చూడబోతున్నామా…? ఇప్పుడే ఇలా అనడం సరికాకపోవచ్చు కానీ పరిస్థితులు మాత్రం అటే దారితీస్తున్నాయి. ఓ వైపు రష్యా పంతం, మరోవైపు ఉక్రెయిన్ మొండితనం , దాన్ని వెనకనుంచి ఆడిస్తున్న అమెరికా ఆట ఇంకోవైపు… ఇప్పుడీ యుద్ధంలోకి పరోక్షంగా చైనా దూకబోతోంది. రష్యాకు చైనా ఆయుధ సాయం చేయబోతోందన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. నిజంగా చైనా ఈ యుద్ధంలోకి ఎంటరైతే మాత్రం అది మొత్తం సీన్ ను మార్చేసేదే… అసలు ఈ గేమ్ లో డ్రాగన్ ఆశిస్తోంది ఏంటి…?
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా చైనా ఆయుధాలను అందించబోతోందన్నది అమెరికా ఆరోపణ… ఇప్పటికే అందిస్తోందన్నది దాని అనుమానం కూడా. చైనా ఇప్పటికే ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఇదంతా అమెరికా చేస్తున్న తప్పుడు ప్రచారమంటూ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. అయితే అంతర్జాతీయ నిపుణులు మాత్రం అమెరికా ఆరోపణలను అంత ఈజీగా కొట్టిపారేయలేం అంటున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి చైనా రష్యా వెంటే ఉంది. నేరుగా యుద్ధంలోకి దిగలేదు కానీ పలు రకాలుగా సాయం అందిస్తోంది. రష్యా ఆయిల్ కొంటోంది. ఆర్థికసాయాన్ని అందిస్తోంది. క్రెమ్లిన్ కు తన మద్దతును ఎక్కడా దాచుకోవడానికి ప్రయత్నించలేదు డ్రాగన్.
యుద్ధం మొదలై ఏడాది గడిచింది. అటు రష్యా గెలవలేదు. ఇటు ఉక్రెయిన్ ఓడలేదు. రెండు వైపులా తీవ్ర నష్టం మాత్రం జరిగింది. ఇంకా జరుగుతోంది. సైనిక, ఆయుధ, ఆర్థిక సాయాన్ని సమకూర్చుకోవడానికి రెండు దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. రష్యా తన సైనిక శక్తిని చాలావరకు ఖర్చుపెట్టింది. అలసిపోయి ఉన్న ఈ సమయంలో రష్యాకు మద్దతుగా చైనా రంగంలోకి దిగితే మాత్రం మొత్తం ఈక్వేషన్స్ మారిపోతాయి. చదరంగంలో పావులు చెదిరిపోతాయి. చిన్న దేశమైనా ఉక్రెయిన్ ఇప్పటివరకు పోరాడిందంటే దానికి కారణం పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆయుధ సాయం.. ఇప్పుడు చైనా దిగితే రష్యా బలం రెట్టింపవుతుంది. ఉక్రెయిన్ ఆధిపత్యం తగ్గిపోతుంది.
రష్యా ఆయుధాల గురించి ఉక్రెయిన్, అమెరికాకు తెలుసు కాబట్టి ఇంతకాలం పోరాటం సాగింది. కానీ ఇప్పుడు చైనా లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వంటివి రంగంలోకి దిగితే ఉక్రెయిన్ ఎంత వరకు తట్టుకుంటుందన్నది పెద్దప్రశ్నే. అది అమెరికాకు కూడా ఓ పరీక్షే… యుద్దానికి ముందు నుంచే చైనా, రష్యాల మధ్య సైనిక సంబంధాలున్నాయి. వాటిని కంటిన్యూ చేస్తున్నామన్నది చైనా వాదన. అయితే అంతకుమించి అన్నది అమెరికా అనుమానం…. చైనా నేరుగా సాయం చేస్తే ఆంక్షలు చుట్టుముడతాయి. ఒక్క అమెరికానే కాదు యూరోప్ దేశాలు కూడా చైనాకు శత్రువులుగా మారిపోతాయి. కాబట్టి చైనా సాయం చేస్తున్నట్లు చెప్పకుండానే చేయాల్సింది చేస్తుంది. రష్యా దగ్గర అడుగంటిపోతున్న ఆయుధ నిల్వలను అందిస్తుంది.
చైనాకు యుక్రెయిన్ శత్రువు కాదు కానీ దాని వెనకున్న పెద్దన్న మాత్రం శత్రువే… అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ అందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు తానే నాయకత్వం వహించాలన్నది చైనా కల. కానీ తన పెద్దన్న హోదాకు అడ్డం వచ్చే దేన్నీ అమెరికా సహించదు. ఈ ఆధిపత్య ధోరణితోనే ఒకప్పుడు యూఎస్ఎస్ఆర్, అమెరికా మధ్య నడిచిన ప్రచ్చన్నయుద్ధం తరహా పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఈ అనిశ్చిత ప్రపంచ సమీకరణాల్లో చైనాకు అండగా నిలబడుతున్న పెద్దదేశం రష్యా మాత్రమే. అందుకే డ్రాగన్ క్రెమ్లిన్ కు ఆయుధ సాయం చేయడానికి రెడీ అంటోంది. ఒకవేళ యుద్ధంలో రష్యా ఓడిపోతే ప్రపంచపటంపై తాము ఒంటరి అవుతానేమోనని చైనా పాలకులు భయపడుతున్నారు. అదే రష్యా గెలిస్తే పరోక్షంగా తాము కూడా గెలిచినట్లే… మరోవైపు అమెరికా గర్వం అణిగినట్లే. రేపు తైవాన్ విషయంలో తాము దూకుడుగా వెళ్లొచ్చు…ఇదీ చైనా కమ్యూనిస్టు పాలకుల ఆలోచన.
మొత్తంగా చూస్తే అగ్రదేశాల ఆధిపత్య చదరంగంలో ఉక్రెయిన్ పావుగా మారిపోయింది. ఇప్పుడు దాని చేతిలో ఏమీ లేదు… చైనా, రష్యా, అమెరికాలు వేసే ఎత్తులను చూస్తూ కాలప్రవాహంలో కొట్టుకుపోవడమే…
(KK)