Revanth Reddy: ఒక్కో మెట్టు దిగుతున్న రేవంత్ రెడ్డి.. అందరినీ కలుపుకుపోవడం సాధ్యమేనా ?
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు రాజకీయాల్లో గొప్పోడు. రేవంత్ ఇదే మాటను పదేపదే వింటున్నారు అనుకుంటా ! కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ఎంతవరకు వెళ్లేందుకు అయినా సిద్ధం.. ఎన్ని మెట్లు దిగేందుకు అయినా సిద్ధం అన్నట్లుగా కనిపిస్తున్నారు.
కోమటిరెడ్డితో రేవంత్ భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. చేరికల విషయంలో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలకపాన్పు ఎక్కినట్లు ప్రచారం జరగగా.. దాన్ని మాటలతో ఖండించడం కాదు.. ములాఖత్‌తో సమాధానం చెప్దాం అన్నట్లుగా రేవంత్ వెళ్లి కోమటిరెడ్డి కలిశారు. కాసేపు మాట్లాడుకున్నారు.. నవ్వుకున్నారు.. హ్యాపీగా ఆ గది నుంచి బయటకు వచ్చారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌కు బలం ఉంది.. క్షేత్రస్థాయిలో బలగం ఉంది.. నడిపించే నాయకుడు లేడు. అదే తెలంగాణలో రెండుసార్లు పార్టీని దెబ్బతీసింది.
అధికారానికి దూరం చేసింది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు కామన్. ఐతే అందరూ కలిస్తే.. అంతా కలిసి నడిస్తే హస్తం పార్టీ విజయాన్ని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. కర్ణాటకలో ప్రూవ్ అయింది అదే. కర్ణాటక విజయం స్ఫూర్తిగా ఇప్పుడు రేవంత్ చేస్తోంది కూడా అదే ! ముందు పార్టీలో విభేదాలకు, అలకలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తనంటే ఇష్టం లేదని తెలిసినా.. తన మీద కోపంగా ఉన్నారని అర్థం అయినా.. నాయకుడిగా తనే ఓ స్టెప్ తీసుకుంటున్నారు. వెళ్లి కలుస్తున్నారు. మీరంతా కలిస్తేనే మనం అనే సందేశాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
గ్రూప్ తగాదాలకు, అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు.. అవసరం అయితే ఎన్ని మెట్లు అయినా దిగేందుకు సిద్ధం అంటున్నారు. కష్టపడాల్సింది మన కోసం కాదు.. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం కోసం అనే సందేశాన్ని ప్రతీచోట వినిపిస్తున్నారు. సీనియర్ల గొడవలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడితో ఆగారా అంటే.. బీజేపీలోకి వెళ్లిన వాళ్లంతా తిరిగి వచ్చేయండి.. అవసరం అయితే ఓ మెట్టు దిగుతానని అంటున్నారు. మరి రేవంత్ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా.. ఎన్నికల వరకు అయినా.. నేతలంతా ఒక్కతాటి మీదకు వస్తారా.. కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అంటే.. కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమే బాస్ !