మెగాటోర్నీకి కౌంట్ డౌన్, సెలక్టర్లకు తలనొప్పి
కొత్త ఏడాదిలో టీమిండియా ఆడబోయే మెగాటోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ... ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికగా టోర్నీ జరగనుండగా... భారత్ ఆడే మ్యాచ్ లకు ఎడారిదేశం ఆతిథ్యమిస్తోంది.
కొత్త ఏడాదిలో టీమిండియా ఆడబోయే మెగాటోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ… ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికగా టోర్నీ జరగనుండగా… భారత్ ఆడే మ్యాచ్ లకు ఎడారిదేశం ఆతిథ్యమిస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఒక్కో ప్లేస్ కోసం ముగ్గురు నలుగురు రేసులో ఉండడంతో సెలక్టర్లకు జట్టు ఎంపిక సవాల్ గా మారింది. 2023 వరల్డ్ కప్ తర్వాత కేవలం 6 వన్డేలే ఆడిన జట్టులో ఎవరిని ఉంచాలో, ఎవరిని తీయాలో సెలక్టర్లకు అర్థం కావడం లేదు.అయితే 2027 వరల్డ్ కప్ రేసులో ఉన్న పలువురు ఆటగాళ్లను సెలక్టర్లు ఇప్పటికే గుర్తించారు. కానీ వేగంగా మారుతున్న పరిస్ధితుల్లో వారికీ అవకాశం దక్కుతుందా లేదా చెప్పలేని పరిస్ధితి.
టీమిండియా వన్డే బ్యాటింగ్ లైనప్ విషయానికొస్తే ఓపెనర్ గా టెస్టు, టీ20ల్లో ఆడుతున్న యశస్వీ జైశ్వాల్ కు అవకాశం దక్కొచ్చు. అలాగే రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ను కొనసాగించే అవకాశముంది. రోహిత్ వన్డే కెప్టెన్ గా ఉంటూ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే..విరాట్ కోహ్లీ నంబర్ త్రీలోనే కంటిన్యూ అవుతాడు. అయితే టాప్ ఆర్డర్‌లోకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను తీసుకుంటే జైస్వాల్ కు చోటు దక్కుతుంది. 2023 వరల్డ్ కప్ తర్వాత అవకాశాలు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్ కూడా రేసులో ఉన్నారు. జాతీయ జట్టుకు దూరమైన మళ్ళీ దేశవాళీ క్రికెట్ లో వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్న శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఖాయం. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరూ వికెట్ కీపర్లుగా ఎంపిక కానున్నారు. హార్థిక్ పాండ్యా పేస్ ఆల్ రౌండర్ గా కొనసాగడం ఖాయం.
అయితే స్పిన్ ఆల్ రౌండర్ల కోటాలో నలుగురు రేసులో నిలిచారు. సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాకు తోడు అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్ , రియాన్ పరాగ్ కూడా పోటీ పడుతున్నారు. పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి ఎంపికైనా ఫిట్ గా ఉంటేనే తుది జట్టులో చోటు దక్కుతుంది. మహ్మద్ షమీ రీఎంట్రీ ఖాయమవగా… సిరాజ్ , అర్షదీప్ సింగ్ కూడా ఎంపికవడం ఖాయమని చెప్పొచ్చు. ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి లు బౌలింగ్ బ్యాకప్ స్ధానాలకు పోటీ పడుతున్నారు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఫిట్ నెస్ నిరూపించుకుంటే ఎంపిక కావచ్చు.వరుణ్ చక్రవర్తి కూడా దేశవాళీ క్రికెట్ లో రాణిస్తుండడంతో అతన్ని కూడా పరిగణలోకి తీసుకునే ఛాన్సుంది.