COVID-19: మళ్లీ కోవిడ్ విజృంభణ.. మరో వేవ్ తప్పదా? నిపుణులు ఏమంటున్నారు?

దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఆరు నెలల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. జాగ్రత్తలు తీసుకోవాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరో వేవ్ వస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2023 | 03:26 PMLast Updated on: Apr 03, 2023 | 3:26 PM

Covid Cases Are Increasing Is The Next Covid Wave Coming

COVID-19: దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలూ నమోదవుతున్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 3,824 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 27 శాతం పెరుగుదల కనిపించింది. ఈ స్థాయిలో కేసులు పెరిగిపోతుండటంపై మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే, నిజంగా మళ్లీ ఇంకో వేవ్ వచ్చే ఛాన్స్ ఉందా?

184 రోజుల తర్వాత ఇదే అధికం
184 రోజుల తర్వాత ఆదివారం అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,389. రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మహారాష్ట్రలో ముగ్గురు మరణించరు. ఇప్పటివరకు కోవిడ్ కారణంగా దేశంలో 5,30,881 మంది మరణించారు. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.04, డైలీ పాజిటివిటీ రేటు 2.87 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతం, మరణాల రేటు 1.82 శాతం, రికవరీ రేటు 98.13 శాతంగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 3,488. ఢిల్లీలో ఒక్క రోజే 429 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,41,75,135 (4.41 కోట్ల) మంది కోవిడ్ బారిన పడ్డారు. దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పూర్తయ్యాయి.

మరో వేవ్ తప్పదా?
ప్రస్తుతం కేసుల సంఖ్య పెరిగిపోతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ మరీ ప్రమాదకరం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. కారణం.. కోవిడ్ కేసులు నమోదవుతున్ననప్పటికీ రోగుల్లో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. ప్రాణాంతక పరిస్థితులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ మందికి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసులు మరీ భారీగా పెరిగి, ప్రజలు ఆస్పత్రుల పాలయ్యే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మరో వేవ్ రాకపోవచ్చని భావిస్తున్నారు. అయితే, కోవిడ్ వైరస్‌కు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని, దీని ద్వారా ప్రమాదకర వైరస్ వేరియెంట్‌ను గుర్తించే వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదువున్న ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేయాలని కూడా సూచిస్తున్నారు.

COVID-19

కేంద్రం హెచ్చరిక
కోవిడ్ కేసుల విజృంభణపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. టెస్టింగ్, వ్యాక్సినేషన్ చేపట్టాలని సూచించింది. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఆస్పత్రుల్లో సిబ్బందితోసహా ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫ్రంట్ లైన్ వర్కర్స్, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం ఆదేశించింది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. కేసుల సంఖ్య పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి.

ఎక్స్‌బీబీ 1.16తో జాగ్రత్త
ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కువగా విజృంభిస్తున్న కోవిడ్ సబ్ వేరియెంట్ ఎక్స్‌బీబీ 1.16. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరో 22 దేశాల్లోనూ ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. మన దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతం ఈ వైరస్ వల్లేనని తాజాగా గుర్తించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ వైరస్ సోకుతోంది. అయితే, వైరస్ సోకినప్పటికీ ఎలాంటి తీవ్ర వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

మరింత ప్రాణాంతకంగా ఆఫ్రికా వైరస్
ఇటు కోవిడ్ వైరస్, అటు హెచ్3ఎన్2 వల్ల సతమతమవుతుంటే మరో ప్రమాదకర వైరస్ ఆఫ్రికాను వణికిస్తోంది. ఎబోలా, మార్గ్ బర్గ్ వైరస్‌లను పోలిన వైరస్ ఆఫ్రికాను భయపెడుతోంది. ఈ వైరస్ సోకిన వాళ్లు 24 గంటల్లోనే మరణిస్తున్నారు. ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి రోగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో ఈ వైరస్ విషయంలో కూడా కేంద్రం అప్రమత్తంగా ఉంది. ఆఫ్రికా దేశాలకు వెళ్లే లేదా ఆ దేశాల నుంచి వచ్చే భారతీయులు ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

COVID-19