ఎడారి దేశంలో క్రికెట్ హీట్ భారత్,పాక్ మ్యాచ్ కు అంతా రెడీ
భారత్, పాకిస్థాన్ జట్లు ఎప్పుడు తలపడినా అభిమానుల్లో ఉండే క్రేజే వేరు... పురుషుల క్రికెట్ లోనే కాదు మహిళల క్రికెట్ లోనూ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. మరోసారి ఇలాంటి మజా అభిమానులను అలరించబోతోంది.
భారత్, పాకిస్థాన్ జట్లు ఎప్పుడు తలపడినా అభిమానుల్లో ఉండే క్రేజే వేరు… పురుషుల క్రికెట్ లోనే కాదు మహిళల క్రికెట్ లోనూ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. మరోసారి ఇలాంటి మజా అభిమానులను అలరించబోతోంది. మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్, పాక్ జట్లు ఆదివారమే తలపడబోతున్నాయి. దీంతో రెండు దేశాల క్రికెట్ అభిమానులు ఈ పోరు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చిత్తుగా ఓడిన భారత మహిళల జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. సెమీస్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ లలోనూ గెలవడమే కాదు రన్ రైట్ సైతం మెరుగుపరుచుకోవాలి. అందుకే పాక్ ను చిత్తుగా ఓడించాలని హర్మన్ ప్రీత్ టీమ్ పట్టుదలగా ఉంది. కివీస్ తో మ్యాచ్ లో తప్పిదాలను రిపీట్ కాకుండా చూసుకుంటే పాక్ ను ఓడించడం భారత్ కు పెద్ద కష్టం కాదు. గత మ్యాచ్ లో బౌలర్లు తేలిపోగా… ఫీల్డింగ్ కూడా పేలవంగా ఉంది. ఇక బ్యాటింగ్ లో కీలక ప్లేయర్స్ అంతా నిరాశపరిచారు. ఈ నేపథ్యంలో పాక్ పై బ్యాటర్లు , బౌలర్లు గాడిన పడితే వరల్డ్ కప్ లో భారత్ తొలి విజయాన్ని అందుకోవచ్చు.
షెఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే భారీస్కోరుకు పునాది పడుతుంది. అలాగే సీనియర్లు హర్మన్ ప్రీత్ , స్మృతి మంధాన , జెమీమా కీలకం కానున్నారు. చివర్లో రిఛా ఘోష్ కూడా దూకుడుగా ఆడితే తిరుగుండదు. ఇక బౌలింగ్ లో రేణుకా సింగ్, దీప్తి శర్మ, శ్రేయాంకా పాటిల్ పై అంచనాలున్నాయి. కివీస్ పై మన బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ప్రత్యర్థి భారీస్కోరు చేసింది. ఇక తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ శ్రీలంకపై గెలిచి శుభారంభం చేసింది. అయితే భారత్ ను ఓడించడం పాక్ జట్టుకు అంత ఈజీ కాదు. గత రికార్డుల్లో పూర్తిగా భారత జట్టుదే పై చేయిగా ఉంది. 15 మ్యాచ్ లలో భారత్ 12 సార్లు గెలిస్తే.. గత 8 మ్యాచ్ లలో ఏడింటిలో విజయం సాధించింది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న దుబాయ్ పిచ్ స్లో బౌలర్లకు సహరిస్తోంది. దీంతో మరోసారి స్పిన్నర్లే కీలకం కానున్నారని అంచనా వేస్తున్నారు.