Jahnavi: అమెరికా తెల్ల తోలు కండకావరంపై నిరసన.. జాహ్నవినిచంపిన పోలీస్ పై చర్య కు డిమాండ్
అమెరికా లో ఎంఎస్ విద్యార్థిని జాహ్నవి కందుల మరణం ఆతర్వాత జరిగిన పరిణామాల పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వినిపిస్తున్నాయి. అమెరికన్ పోలీస్ కండకావరం పై మానవ హక్కుల సంఘాలు విరుచుకు పడుతున్నాయి.
జాహ్నవి కందులకు న్యాయం చేయాలంటూ సియాటెల్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. డానియల్ అడిరర్ వంటి అధికారులు విధుల్లో ఉంటే.. జనం ప్రాణాలకు భద్రత ఉండదంటున్నారు. ఈ మేరకు దాఖలైన ఆన్‌లైన్ పిటిషన్‌పై వేలాది మంది సంతకాలు చేశారు. మరోవైపు.. అనుచిత వ్యాఖ్యలు చేసిన డానియల్ అడిరర్ కాపాడే ప్రయత్నాలు ప్రారంభించింది అమెరికన్ పోలీసు అధికారులు సంఘం.
అమెరికా సియాటెల్‌లో జనవరి 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు జాహ్నవి కందుల చనిపోయింది. డ్రగ్ ఓవర్ డోసుకు సంబంధించిన సమాచారం అందడంతో మితిమీరిన వేగంతో ప్రయాణించాడు పోలీస్ అధికారి కెవిన్ డేవ్. గంటకు 119 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్న అతను.. రోడ్డు దాటుతున్న జాహ్నవిని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి జాహ్నవి చనిపోయింది.
ప్రమాదం తరువాత జాహ్నవి మృతిపై వ్యంగ్యంగా మాట్లాడాడు సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డానియల్ అడిరర్. ప్రమాదానికి కారణమైన కెవిన్ డేవ్‌ను సమర్థిస్తూ వచ్చాడు. అవును ఓ 11 వేల డాలర్లకు చెక్కు రాసివ్వు మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 9లక్షలు. ఆమె వయస్సు 26 ఏళ్లే ఆమెకు అంతకు మించి విలువ లేదు అంటూ నవ్వుతూ సలహా ఇచ్చాడు డానియల్ అడిరర్.
జాహ్నవి మృతిపై పోలీస్ అధికారి డానియల్ అడిరర్ ప్రేలాపన అతని బాడీవార్న్ కెమెరాలో రికార్డయింది. ఇటీవల ఆ వీడియో బయటకు రావడంతో దుమారం రేగింది. మనుషుల ప్రాణాలకు విలువ లేదా అంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. సియాటెల్‌లో పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. డానియల్ అడిరర్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు అతనిపై క్రిమినల్ దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే.. సియాటెల్ పోలీసు అధికారుల సంఘం అతనికి అండగా నిలిచింది. చనిపోయిన జాహ్నవిని కించపరడం డానియల్ ఆడిడర్ ఉద్దేశం కాదని.. అతని సంభాషణను ఆ దృష్టితో చూడ్డొద్దంటోంది. అంతేకాదు బాడీవార్న్ కెమెరాలో సంభాషణలో ఒక వైపు మాటలే రికార్డయ్యాయని చెబుతోంది. పూర్తి సంభాషణలు వింటే ఏం జరిగిందో అర్థమవుతుందని చెప్పుకొస్తోంది.
ఈ అంశంపై డానియల్ అడిరర్ వివరణ ఇస్తూ రాసిన లేఖను కూడా విడుదల చేసింది. లేఖలో తాను లాయర్లను అనుకరిస్తూ అలా మాట్లాడినట్టు చెప్పాడు అడిరర్. చనిపోయిన జాహ్నవిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని తెలిపాడు. సియాటెల్ పోలీస్ అధికారుల సంఘానికి డానియల్ అడిరర్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. పోలీసుల్ని బాధ్యుల్ని చేసే ప్రతి అంశంలోనూ ఈ సంఘం కలుగజేసుకుంటూ.. తప్పు చేసిన అధికారుల్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. డానియల్ అడిరర్‌ను విధుల నుంచి తొలగించాలంటూ చేంజ్ డాట్ ఆర్గ్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇప్పటికే వేలాది మంది సంతకాలు చేశారు. ఆడిరర్‌ను విధుల్లో కొనసాగించడం అంటే.. జనం ప్రాణాలతో చెలగాటం ఆడడమేనంటూ పిటిషన్లో పేర్కొన్నారు. సియాటెల్ పోలీసులకు సామాన్యుల భద్రతపై కనీస శ్రద్ధ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి జాహ్నవి మృతిపై రేగుతున్న దుమారం ఇప్పట్లో చల్లరే సూచనలు కనిపిండం లేదు. ఇండియా లో చాలా యూనిర్సిటీల్లో, అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు.