దూకుడు లేకుంటే కష్టం రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత సొంతగడ్డపై ఫుల్ జోష్ లోనే కివీస్ తో సిరీస్ రెడీ అయింది. వరుస విజయాలు, గత రికార్డుల ప్రకారం చూస్తే మన జట్టే ఫేవరెట్.. అదే సమయంలో కివీస్ ను తేలిగ్గా తీసుకున్నట్టు కనిపించింది.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత సొంతగడ్డపై ఫుల్ జోష్ లోనే కివీస్ తో సిరీస్ రెడీ అయింది. వరుస విజయాలు, గత రికార్డుల ప్రకారం చూస్తే మన జట్టే ఫేవరెట్.. అదే సమయంలో కివీస్ ను తేలిగ్గా తీసుకున్నట్టు కనిపించింది. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకోవడం ద్వారా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసిందా అన్న అనుమానాలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక్క ఇన్నింగ్స్ తోనే చిత్తు చేయడానికి ఇది బంగ్లా టీమ్ కాదు… క్వాలిటీ క్రికెట్ ఆడే కివీస్ జట్టన్న విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. దానికి తగ్గట్టే కివీస్ పేసర్లు రెండోరోజు చెలరేగిపోయారు. భారత బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అత్యంత ఘోరంగా 46 పరుగులకే ఇండియాను ఆలౌట్ చేశారు. నిజానికి ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూడోరోజు ఆట ఆరంభంలోనే కివీస్ వికెట్లు చేజార్చుకుంది. 233 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి త్వరగా ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే కీలక బ్యాటర్ రచిన్ రవీంద్రకు టెయిలెండర్ టిమ్ సౌథీ చక్కని సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరి 112 పరుగుల పార్టనర్ షిప్ భారత్ కొంపముంచింది. నిజానికి రోహిత్ సరైన టైమ్ బౌలింగ్ మార్పులు చేయకపోవడం కివీస్ ఆధిపత్యానికి కారణమైందని పలువురు విశ్లేషిస్తున్నారు. స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్‌దీప్ బౌలింగ్‌లో రచిన్, సౌథి బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తిస్తున్నా.. కెప్టెన్ రోహిత్ శర్మ లంచ్ విరామానికి ముందు ఆఖరి ఓవర్ వరకు పేసర్లకు బంతినివ్వలేదు. అలాగే హిట్ మ్యాన్ ఫీల్డింగ్ ప్లాన్స్ కూడా పేలవంగా కనిపించాయి. బౌండరీలను కట్టడి చేయడానికి ఫీల్డర్లను మోహరించడంలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు.
టీ ట్వంటీీ తరహాలో న్యూజిలాండ్ చెలరేగిపోతున్నా బుమ్రా చేత రోహిత్ బౌలింగ్ చేయించలేదు. లంచ్ బ్రేక్ కు ముందు చివరి 4 ఓవర్లలో కివీస్ ఏకంగా 58 పరుగులు రాబట్టుకుంది. అశ్విన్ వేసిన ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. మైదానంలో టీమిండియా ఆటతీరును డ్రెస్సింగ్ రూమ్ నుంచి గంభీర్ నిస్సహాయంగా గమనిస్తున్నాడు.కివీస్ బ్యాటర్ల విధ్వంసంతో మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడికి లోనైనట్టు కనిపించాడు. రివ్యూ తీసుకునే విషయంలోనూ చాలా పొరపాట్లు చేశాడు. దీంతో రోహిత్ తన కెప్టెన్సీ విషయంలో దూకుడుగా ఉండకపోతే కష్టమని మాజీ ఆటగాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సారథ్యంలో రోహిత్ ధోనీని అనుసరించాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. ధోనీ వికెట్ల కోసం తరచుగా బౌలర్లను మారుస్తూ ఫలితాన్ని రాబడతాడని గుర్తు చేశాడు.