AYODHYA RAM MANDIR: రాముడి పేరుతో సైబర్ మోసం.. జాగ్రత్త.. అవి క్లిక్ చేయొద్దు!

అయోధ్య రాముడికి ఉన్న ఇమేజ్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు సైబర్ క్రిమినల్స్. ప్రజలకు ఫేక్ లింక్స్ పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేస్తే చాలు.. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ గాళ్ళు ఇండియాలోనే కాదు.. పాకిస్తాన్ నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 20, 2024 | 04:35 PMLast Updated on: Jan 20, 2024 | 4:35 PM

Cyber Crimesters Sends Fake Links About Ayodhya Ram Mandir

AYODHYA RAM MANDIR: అయోధ్యలో శ్రీ రామమందిరంలో ఈనెల 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా రాముడికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతున్నాయి. అయోధ్య రాముడి ఫోటోలు, వీడియోలు.. ఇలా ఏవి కనిపించినా భక్తులు ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే అయోధ్య రాముడికి ఉన్న ఇమేజ్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు సైబర్ క్రిమినల్స్. ప్రజలకు ఫేక్ లింక్స్ పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేస్తే చాలు.. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు.

Ayodhya Sri Rama : రాముడి ఫోటోలు తీయడం దోషమా..? తెర తీసేయడంపై పూజారుల ఆగ్రహం

ఇలాంటి ఫేక్ గాళ్ళు ఇండియాలోనే కాదు.. పాకిస్తాన్ నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు. అయోధ్య రాముల వారిని కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. అయోధ్య రాముడి ఫోటోలు, వీడియోల కోసం క్లిక్ చేయండి అంటూ.. SMSల ద్వారా ఫేక్ లింక్‌లు పంపుతున్నారు కేటుగాళ్లు. అయోధ్యకు ఎలా వెళ్ళాలో తెలుసా.. అయోధ్యకి వెళ్ళాలనుకుంటున్నారా..? అయితే ట్రావెల్స్, ఛార్జీలు, రూం అద్దెలు వివరాల కోసం క్లిక్ చేయండి అంటూ లింక్‌లు పంపుతున్నారు. అలాగే అయోధ్య రామాలయం నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవుతారా.. అయితే 10 రూపాయల నుంచి 100 రూపాయల దాకా పంపే అద్భుత అవకాశం అంటూ మరికొన్ని లింక్‌లను సోషల్ మీడియాలో, SMSల ద్వారా పంపుతున్నారు. ఇలాంటి ఫేక్ లింక్‌లపై క్లిక్స్ చేస్తే చాలు.. వెంటనే యూజర్ల మొబైల్ ఫోన్ హ్యాక్ చేస్తారని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మీకు తెలియకుండానే.. మొబైల్‌లో వైరస్ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి.. అందులో ఉన్న డబ్బును కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అందుకే ఫేక్ లింక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసుల హెచ్చరిస్తున్నారు.

ఎవరూ కూడా ఇలాంటి లింక్‌లపై క్లిక్ చేయకూడదని సూచిస్తున్నారు. అయోధ్యకు వెళ్ళాలన్నా.. అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నా.. ఆథరైజ్డ్ వెబ్‌సైట్స్ లేదా యాప్స్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇండియాలోనే కొన్ని ఏరియాల్లో తిష్టవేసిన సైబర్ క్రిమినల్స్ ఇలాంటి ఫేక్ లింక్స్ పంపుతూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. అయితే పాకిస్తాన్ నుంచి కూడా రామమందిరానికి సంబంధించి తప్పుడు ఫోటోలు, వార్తలతో ఫేక్ టూల్ కిట్స్ రెడీ చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు రిపోర్ట్ అందింది. ఈనెల 22న బాల రాముడి ప్రతిష్ట జరిగే రోజు.. పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లో ప్రత్యేకంగా కమాండ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి రామమందిరంపై తప్పుడు ప్రచారం చేసేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. రెచ్చగొట్టే విధంగా ఉన్న ఫేక్ న్యూస్‌పై స్పందించవద్దనీ.. అనవసరంగా ఏ లింక్స్ ఓపెన్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.