Top Story : అగ్ర రాజ్యాల మధ్య సైబర్ వార్.. చైనా చేతికి అమెరికా టాప్ సీక్రెట్స్?

భారీ బాంబులు అవసరం ఉండదు.. మిస్సైళ్ల ఊసే అక్కర్లేదు.. యుద్ధ విమానాలు, లక్షల మంది సైన్యం, ఇవేవీ అక్కర్లేకుండానే శత్రువు అంతు చూడొచ్చు. సింగిల్ బటన్‌తో ఒక్క రక్తపు చుక్క కూడా నేలరాలకుండానే ప్రత్యర్థి కథ ముగించేయొచ్చు. ఆ యుద్ధ రీతి ఏంటనుకుంటున్నారా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 09:43 PMLast Updated on: Jan 02, 2025 | 9:43 PM

Cyber War Between Top Powers Americas Top Secrets In Chinas Hands

భారీ బాంబులు అవసరం ఉండదు.. మిస్సైళ్ల ఊసే అక్కర్లేదు.. యుద్ధ విమానాలు, లక్షల మంది సైన్యం, ఇవేవీ అక్కర్లేకుండానే శత్రువు అంతు చూడొచ్చు. సింగిల్ బటన్‌తో ఒక్క రక్తపు చుక్క కూడా నేలరాలకుండానే ప్రత్యర్థి కథ ముగించేయొచ్చు. ఆ యుద్ధ రీతి ఏంటనుకుంటున్నారా? సైబర్ వార్‌ఫేర్..? మీరు విన్నది నిజమే.. అగ్రదేశాలు ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తున్న ఈ వార్‌ఫేర్‌ ఇప్పుడు ఆచరణలోకి వచ్చినట్టే కనిపిస్తోంది. ఇందుకు కారణం అమెరికా, డ్రాగన్ కంట్రీల కౌంటర్లే. గత కొంత కాలంగా ఈ టాప్ కంట్రీస్ సైబర్ దాడుల ఆరోపణలతో రచ్చ చేస్తున్నాయి. ఇంతకూ, అమెరికా-చైనా మధ్య జరుగుతున్న సైబర్ యుద్ధం ఏంటి? ఈ రెండు దేశాల మధ్య సైబర్ యుద్ధం ముదిరితే ఏం జరుగుతుంది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

ఒకటేమో ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా.. మరొకటేమో పెద్దన్న హోదాకోసం పోటీ పడుతున్న చైనా. ప్రపంచ ఆధిపత్యం కోసం ఢీ అంటే ఢీ అంటున్న ఈ రెండు దేశాలు తాజాగా గేర్ మార్చేశాయి.. గేమ్ ఛేంజ్ చేసేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా డ్రాగన్ కంట్రీని కంట్రోల్ చేసేందుకు ఉన్న అన్ని దారులనూ సద్వినియోగం చేసుకుంటూ తైవాన్‌కు అండగా నిలుస్తుంటే.. చైనా మాత్రం తనకు అచ్చొచ్చిన సీక్రెట్ ఆపేరేషన్లకే మరోసారి పదునుపెడుతోంది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యంపై సైబర్ అటాక్స్‌ సంచలనం రేపితే.. పెంటగాన్ నుంచి కూడా అదేస్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. ఇలా ఇరు దేశాలు సరికొత్త వార్‌ఫేర్.. సైబర్ యుద్ధానికి తెరలేపడం గ్లోబల్ టెన్షన్స్‌కు కారణమవుతోంది.

చైనా అధికారిక హ్యాకర్లు తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై సైబర్ దాడికి పాల్పడినట్టు అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. వర్క్‌స్టేషన్లలో కీలకమైన పత్రాలను తస్కరించేందుకు చైనా ప్రయత్నించినట్లు ఆరోపించింది. థర్డ్‌ పార్టీ సైబర్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ప్రొవైడర్‌ బియాండ్‌ ట్రస్ట్‌ నెట్‌వర్క్‌ లోపాలను తన అనుకూలంగా చేసుకుని డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో చైనాకు చెందిన అడ్వాన్సడ్ పెర్సిస్టెంట్ థ్రెట్ హ్యాకర్లు దాడి చేసినట్టు తెలిపింది. వర్క్‌స్టేషన్లు, కీలకమైన పత్రాలను యాక్సెస్ చేయగలిగారని పేర్కొంది. డిసెంబర్‌ 8న బియాండ్‌ ట్రస్ట్‌ అప్రమత్తమై ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని ట్రెజరీ విభాగం అసిస్టెంట్ సెక్రెటరీ హర్దికర్ తెలిపారు. తర్వాత సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎఫ్‌బీఐ‌లకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. ఇది భారీ సైబర్‌ దాడిగా చెప్పిన
హర్దికర్.. ప్రస్తుతం దర్యాప్తు సంస్థ సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మరోవైపు.. అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తమపై అమెరికా చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను గట్టిగా ఖండిస్తున్నామని ప్రకటించింది. ఐతే జార్జియాలోని బియాండ్‌ ట్రస్ట్‌ సైతం ఈ సైబర్‌ దాడిపై స్పందించలేదు. ట్రెజరీ విభాగం రాసిన లేఖలో మాత్రం, ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌క్లౌడ్ ఆధారిత సేవలకోసం వినియోగించే టెక్నాలజీని హ్యాకర్లు యాక్సెస్ చేసినట్టు పేర్కొంది. ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఇటీవల తమ కస్టమర్ల భద్రత ముప్పునకు సంబంధించిన ఘటనలు గుర్తించినట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు స్పష్టంచేసింది. ఇక ఈ సైబర్ దాడిపై విశ్లేషణకు వచ్చే వారం వైట్‌హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ‌ కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో చైనా హ్యాకర్లు సమాచారం వరకే ఆగారా? లేక బ్బులు కూడా మళ్లించుకున్నారా? ఇంకా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడ్డారా? అనే ప్రశ్నలకు అమెరికా అధికారులు సమాధానం చెప్పడంలేదు.

హ్యాకింగ్ గురించి అమెరికా కొత్తగా చెప్పింది కానీ.. చాలా సంవత్సరాల నుంచి చైనా అదే చేస్తోంది. పాఠశాల విద్య నుంచే హ్యాకింగ్‌ను ఒక సబ్జెక్టుగా మార్చింది. అక్కడ ఏకంగా యూనివర్సిటీలలో ఈ కోర్స్ గురించి విద్యార్థులకు ప్రత్యేకంగా చెబుతోంది. భవిష్యత్తు కాలం మొత్తం సైబర్ వార్‌ఫేర్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి.. ముందు జాగ్రత్తగానే ఇలాంటి విధానానికి చైనా శ్రీకారం చుట్టింది. దీనివల్ల ప్రత్యర్థి దేశాల మీద సైబర్ దాడులు చేయిస్తూ.. కీలక సమాచారాన్ని తస్కరించి.. తమకు అనుకూలంగా మార్చు కోవాలనేది చైనా ప్లాన్. ఇప్పటికే దీనిని అమల్లో పెట్టింది కూడా.. ఆ మధ్య భారత్, జపాన్, వంటి దేశాలపై సైబర్ అటాక్స్ చేయించింది. అయితే ఆ దేశాల సైబర్ భద్రత పటిష్టంగా ఉండటంవల్ల చైనా ఆటలు సాగలేదు. మరి టెక్నాలజీకి సరికొత్త పాఠాలు చెప్పే అమెరికా చైనా విషయంలో ఎందుకు అలర్ట్ కాలేక పోయింది? సైబర్ నేరగాళ్లు కీలక ట్రెజరీ శాఖను యాక్సెస్ చేస్తుంటే ఎందుకు చూస్తూ ఉండిపోయింది? ఈ ప్రశ్నలకు అమెరికా దగ్గర సమాధానం లేదు.

సైబర్ దాడులపై ఇరు దేశాల కౌంటర్లు చూస్తుంటే.. ప్రపంచంలో మొదటి సైబర్ వార్‌కు తెరలేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. సైబర్ పరిశోధనల్లో అమెరికా, చైనా, రష్యాలే ముందున్నాయి. రానున్న రోజుల్లో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఈ సైబర్ యుద్ధాలతో శత్రు దేశంలోని అన్ని వ్యవస్థలనూ కుప్పకూల్చేయొచ్చని ప్రకటించింది కూడా ఈ దేశాలే. ఇప్పుడు అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా వ్యూహం మార్చాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే.. ఈ సైబర్ యుద్ధం అమెరికా, చైనా మధ్య ఆగిపోదు. ఆ రెండు దేశాల మధ్య సైబర్‌ వార్‌లో మరిన్ని దేశాలు నలిగిపోవడం ఖాయం. ఇప్పుడదే అంశం గ్లోబల్ టెన్షన్‌కు కారణమవుతోంది.