Biporjoy Cyclone: ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్ తుఫాన్.. హీరోలుగా మారిన కోస్ట్‌గార్డ్ సిబ్బంది
అరేబియా సముద్రం నుంచి ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్ తుఫాన్ ముప్పు పొంచి ఉండడంతో.. గుజరాత్ తీరంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ద్వారక తీరంలో ఓ ఆయిల్ రిగ్‌లో పనిచేస్తున్న 50మంది సిబ్బందిని కోస్ట్‌గార్డ్ కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించింది.

Cyclone Effect in Gujrat
అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎంతో సాహసోపేతంగా కోస్ట్‌గార్డ్ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ద్వారకలోని ఓఖా తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీ సింగపూర్ ఆయిల్ రిగ్‌లో సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే తుఫాన్ ప్రభావంతో వీరికి ముప్పు పొంచి ఉండటంతో వీరిని రక్షించేందుకు కోస్ట్‌గార్డ్ రంగంలోకి దిగింది. సోమవారం సాయంత్రం నుంచి నిరంతర ఆపరేషన్ చేపట్టి మొత్తం 50మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. కోస్ట్‌గార్డ్‌కు చెందిన శూర్ వాహకనౌక, తేలికపాటి హెలికాప్టర్ ఎంకే 3 సాయంతో సహాయక చర్యల కొనసాగాయ్.
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో మొత్తం ఏడు సార్టీలు నిర్వహించి అధికారులు వీరిని కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కోస్ట్‌గార్డ్ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. శూర్ నౌకపై హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసి వీరిని తరలించారు. బలమైన గాలులు వీస్తున్నా.. ఎంతో చాకచక్యంగా సిబ్బందిని రక్షించారు. ఇక అటు బిపోర్‌జాయ్ తుఫాన్ కాస్త బలహీనపడినప్పటికీ.. తీరం దాటే సమయంలో తీవ్ర విధ్వంసం సృష్టించే సామర్థ్యం దీనికి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గుజరాత్‌లోని జఖౌ తీరంలో గురువారం సాయంత్రం ఈ తుపాను తీరం దాటనుంది. ఆ సమయంలో ద్వారక, జామ్‌నగర్, కచ్, మోర్బీ తదితర జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంటున్నారు.