మొన్న డకౌట్..నిన్న శతకం అదిరిందయ్యా సర్ఫరాజ్

టీమిండియాలో చోటు దక్కడం ఒక్క ఎత్తయితే... దానిని నిలబెట్టుకోవడం మరో ఎత్తు... అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ కిక్కే వేరు... ఇలాంటి కిక్కే ఆస్వాదిస్తున్నాడు టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్... ఊహించని విధంగా గిల్ మెడనొప్పితో కివీస్ తో తొలి టెస్టుకు దూరమయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 20, 2024 | 03:45 PMLast Updated on: Oct 20, 2024 | 3:45 PM

Day Before Duckout Yesterdays Century

టీమిండియాలో చోటు దక్కడం ఒక్క ఎత్తయితే… దానిని నిలబెట్టుకోవడం మరో ఎత్తు… అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ కిక్కే వేరు… ఇలాంటి కిక్కే ఆస్వాదిస్తున్నాడు టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్… ఊహించని విధంగా గిల్ మెడనొప్పితో కివీస్ తో తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో సర్ఫరాజ్ కు అవకాశం దక్కింది. దేశవాళీ క్రికెట్ లో సూపర్ ఫామ్ తో దుమ్మురేపుతున్న ఈ యువ ఆటగాడు టెస్ట్ జట్టులోకి ఎంపికవుతున్నా తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. ఈ ఏడాది ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ తో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఆరంభంలోనే ఆకట్టుకున్నాడు. మూడు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఈ కారణంగానే కివీస్ తో సిరీస్ ఎంపికైన సర్ఫరాజ్ బెంగళూరు టెస్టు తుది జట్టులోకి ఎంపికవడం, వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు.

అది కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జైశ్వాల్, రోహిత్ ఔటైన తర్వాత కోహ్లీ, పంత్ లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కోహ్లీతో 136 పరుగుల పార్టనర్ షిప్ భారత్ భారీస్కోరుకు పునాది వేసిందని చెప్పొచ్చు. తర్వాత నాలుగోరోజు పంత్ తో కలిసి కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. ఈ క్రమంలో 110 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదే తొలి శతకం. ఇలా డకౌట్ అయిన తర్వాత సెంచరీ చేయడం ద్వారా సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన 9వ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, సునిల్ గవాస్కర్ సరసన నిలిచాడు.

1977లో సునీల్ గవాస్కర్, 1979లో దిలీప్ వెంగ్‌సర్కార్, 1989లో మహమ్మద్ అజారుద్దీన్, 1999లో సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, 2017లో విరాట్ కోహ్లీ, 2024లో శుభ్‌మన్ గిల్ సర్ఫరాజ్ కన్నా ముందు ఈ ఫీట్ సాధించారు. శతకం తర్వాత సర్ఫరాజ్ జోరు కొనసాగింది. షాట్ సెలక్షన్ లోనూ, ఫుట్ వర్క్ లోనూ పరిణితి చూపించిన ఈ యువ క్రికెటర్ 150 పరుగులకు ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఇన్నింగ్స్ లో 18 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించడం ఏ ప్లేయర్ కైనా ఎంతటి కాన్ఫిడెన్స్ ఇస్తుందో సర్ఫరాజ్ ఆటను చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే సర్ఫరాజ్ ఔటైనా కాసేపటికే పంత్ 99 పరుగులకు వెనుదిరిగాడు. ఒక పరుగు తేడాతో పంత్ సెంచరీ చేజార్చుకోవడం ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది. కాగా ఈ మ్యాచ్ లో కనీసం 200 పైగా టార్గెట్ కివీస్ ముందు ఉంచగలిగితే మ్యాచ్ పై భారత్ ఆశలు పెట్టుకోవచ్చు.