ఆర్సీబీ కెప్టెన్ గా అతడే, డివీలియర్స్ కామెంట్స్
ఐపీఎల్ మెగావేలం హడావుడి అయిపోయింది... ఊహించినట్టుగానే పలువురు స్టార్ ప్లేయర్స్ జాక్ పాట్ కొడితే... మరికొందరని ఫ్రాంచైజీలు అస్సలు పట్టించుకోలేదు. మెగావేలం కావడంతో ఈ సారి జరగబోయే సీజన్ లో చాలా వరకూ అన్ని జట్ల రూపురేఖలు మారిపోబోతున్నాయి.
ఐపీఎల్ మెగావేలం హడావుడి అయిపోయింది… ఊహించినట్టుగానే పలువురు స్టార్ ప్లేయర్స్ జాక్ పాట్ కొడితే… మరికొందరని ఫ్రాంచైజీలు అస్సలు పట్టించుకోలేదు. మెగావేలం కావడంతో ఈ సారి జరగబోయే సీజన్ లో చాలా వరకూ అన్ని జట్ల రూపురేఖలు మారిపోబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జట్లకు కొత్త కెప్టెన్ లు కూడా రాబోతున్నారు. ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ టీమ్స్ లో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సారి వేలంలో మంచి ప్లేయర్స్ నే దక్కించుకుంది. అయితే 18వ సీజన్ లో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ రానున్నాడు. గత సీజన్ వరకూ సారథిగా ఉన్న డుప్లెసిస్ ను బెంగళూరు వేలంలోకి వదిలేసింది. ప్రస్తుతం ఆర్సీబీకి కెప్టెన్సీ ఆప్షన్స్ చాలానే కనిపిస్తున్నా… విరాట్ కోహ్లీకే ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా కోహ్లీపై బెంగళూరు మాజీ ప్లేయర్స్ ఏబీ డివీలియర్స్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లలో కెప్టెన్ అయ్యే సత్తా విరాట్ కోహ్లీకే ఉందన్నాడు.
ఆ ఫ్రాంచైజీ ఆలోచన కూడా ఇదే ఉండొచ్చని అంచనా వేశాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ జట్టులోనే ఉన్న విరాట్ కోహ్లీ.. 2013 నుంచి 2021 వరకు కెప్టెన్గా వ్యవహరించాడు. కోహ్లీ సారథ్యంలో ఆర్సీబీ నాలుగుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. 2021లో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేయగా.. సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ మూడేళ్ల పాటు సారథ్యం వహించాడు. అయితే, ఈసారి వేలానికి ముందే ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది. ఇదిలా ఉంటే మెగా వేలం తర్వాత లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ పటిష్టంగా మారిందని ఏబీడీ ప్రశంసించాడు. జట్టులో భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్‌వుడ్, లుంగి ఎంగిడీ లాంటి కీలకప్లేయర్లు ఉన్నారనీ, వీరంతా ప్రత్యర్థిని కట్టడి చేసే సత్తా ఉన్నవాళ్లేనని చెప్పుకొచ్చాడు. అయితే స్పిన్ విషయంలోనే ఆర్సీబీ కాస్త వెనకబడినట్లు కనిపిస్తోందన్నాడు. రవి చంద్రన్ అశ్విన్‌ను మిస్ అయ్యామని, అయినప్పటకీ జట్టు కూర్పు బాగుందన్నాడు.
ఇదిలా ఉంటే మెగావేలానికి ముందు రిటెన్షన్ కోసం విరాట్ కోహ్లీకి 21 కోట్లు, రజత్ పాటిదార్ కు 11 కోట్లు, యస్ దయాల్ కు 5 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 37 కోట్లతో ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. దీంతో మెగావేలంలోకి 83 కోట్లతో అడుగుపెట్టిన ఆర్సీబీ ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ల కోసం అత్యధిక మొత్తాన్ని వెచ్చించింది. గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్న ఫాప్ డుప్లెసిస్ సహా గ్లెన్ మ్యాక్స్‌వెల్, విల్ జాక్స్, మహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్లను వదిలేసింది. వారికి బదులు ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్, భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకుంది.