Pakistan Crisis: రేపో మాపో పాక్ దివాళా..!

ఇన్నేళ్లుగా పాక్ పాలకులు చేసిన పాపం ఆ దేశ ప్రజల పాలిట శాపంగా మారింది. అనాలోచిత నిర్ణయాలు, భారత్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి లక్షల కోట్లు తగలేసింది. ముష్కర ముఠాలను పెంచి పోషించింది. దాని పర్యవసానం ఇప్పటికి కానీ దాయాదికి అర్థం కాలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 23, 2023 | 02:00 PMLast Updated on: Feb 23, 2023 | 2:52 PM

Deep Financial Crisis In Pakistan

అప్పుల అప్పారావు సినిమాలో రాజేంద్రప్రసాద్ డైలాగ్ ఉంటుంది. ‘అప్పు’డే తెల్లారిందా అంటూ నిద్రలేస్తాడు. ప్రస్తుతం పాకిస్తాన్ ది అదే పరిస్థితి… రోజూ తెల్లారగానే అప్పుకోసం పరుగులు పెడుతోంది పాక్ యంత్రాంగం… రోజువారి వ్యవహారాలు కూడా గడవని పరిస్థితి… అప్పుకోసం ఆ దేశం పడుతున్న పాట్లు చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది. అప్పుకోసం ఐఎంఎఫ్ పెడుతున్న అడ్డగోలు షరతులకు అడ్డంగా తలూపాల్సి వస్తోంది. ఆరున్నర బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజ్ లో భాగంగా తక్షణరుణం 1.1బిలియన్ డాలర్ల కోసం నానా పాట్లు పడుతోంది. అది వస్తే ఓకే లేదంటే దివాళా ప్రకటన చేయడమే తరువాయి అన్నట్లుంది పరిస్థితి.

ఐఎంఎఫ్ షరతులను అమలు చేసేందుకు పాక్ ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటోంది. దాని ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఐదోవంతు పెరిగాయి. మరింత పెరుగుతుందన్న అంచనాలున్నాయి. పన్నులు విపరీతంగా పెంచేశారు. ఇప్పుడు మరిన్ని చర్యలకు దిగింది పాక్ ప్రభుత్వం… ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి వీలుగా ఈసారి మంత్రులపై పడ్డారు ప్రధాని షెహబాజ్ షరీఫ్..

* ప్రధాని, మంత్రులు, వారి సలహాదారుల జీతభత్యాల్లో కోత
* వచ్చే ఏడాది జూన్ వరకు కొత్త కార్ల కొనుగోలుపై నిషేధం..
* విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు నో
* టెలిఫోన్, కరెంట్, వాటర్, గ్యాస్ బిల్లులను మంత్రులు తమ జీతాల నుంచే చెల్లించుకోవాలి
* మంత్రులు వాడుతున్న అత్యంత ఖరీదైన కార్లను వెనక్కు తీసుకుని వేలం వేయాలి
* దేశ, విదేశాలకు వెళ్లేటప్పుడు ఎకానమీ క్లాస్ లోనే జర్నీ చేయాలి
* ఎక్కడకు వెళ్లినా ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయవద్దు
* ప్రభుత్వ కార్యక్రమాల్లో కేవలం ఒకే ఒక్క వంటకం ఉండాలి
* ప్రధాని, మంత్రుల నివాసాల్లోనూ వంటలపై పరిమితి
* ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రభుత్వ ఆఫీసులు, మంత్రుల ఇళ్లను గ్రూప్ హౌస్లుగా మార్చాలి

ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. మాల్స్, మార్కెట్లను రాత్రి ఎనిమిదిన్నరకే మూసేయాలని ఆదేశించింది. వేసవిలో ప్రభుత్వ కార్యాలయాలను ఉదయం ఏడున్నరకే తెరవాలని నిర్ణయించింది. ముందుగా ఐఎంఎఫ్ నుంచి ఫండ్స్ వస్తే ఎలాగోలా గండం నుంచి గట్టెక్కాలన్నది పాక్ పెద్దల ఆలోచన.

ఈ ఏడాది చివర్లో మన దాయాది దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పన్నులు పెరిగాయి. నిత్యావసరాలు ఆకాశాన్ని అంటాయి. చివరకు రొట్టెలు చేసుకోవడానికి పిండి కూడా దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఐఎంఎఫ్ షరతులకు లోబడి వారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితి. కాదంటే నిధులు రావన్న భయం… దీంతో పాక్ పాలకులు నలిగిపోతున్నారు. ఆదుకుంటుందేమోనని మిత్రదేశం డ్రాగన్ వైపు చూస్తే అది విదిల్చింది అంతంతమాత్రమే..ముస్లిం దేశాలు కూడా ఇక ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు.

పాక్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే విదేశాల్లోని రాయబార కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గిస్తోంది. అంతేకాదు కొన్నిచోట్ల ఆస్తులను అమ్మేస్తోంది. విదేశాల నుంచి ముడిచమురు కొనడానికి కూడా డబ్బులు లేవు… శ్రీలంక స్థితికి పెద్ద భిన్నంగా ఏం లేదు పాక్ పరిస్థితి. విదేశీ మారకద్రవ్య నిల్వలు గతంలో ఎన్నడూ లేనంత తక్కువస్థాయికి పడిపోయాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ రోజో, రేపో దివాళా ప్రకటన చేయాల్సి వచ్చేలా పరిస్థితి ఉంది.

ఇన్నేళ్లుగా పాక్ పాలకులు చేసిన పాపం ఆ దేశ ప్రజల పాలిట శాపంగా మారింది. అనాలోచిత నిర్ణయాలు, భారత్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి లక్షల కోట్లు తగలేసింది. ముష్కర ముఠాలను పెంచి పోషించింది. దాని పర్యవసానం ఇప్పటికి కానీ దాయాదికి అర్థం కాలేదు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం… ఇకపై ఇండియాను బూచిగా చూపించి తమ చేతకానితనాన్ని దాస్తే ప్రజలు నమ్మరని పాక్ పాలకులకు అర్థమైంది. ఇప్పుడు వారి మెడపై కత్తి వేలాడుతోంది.

(KK)