MLC KAVITHA: కవితకు మరో షాక్.. బెయిల్ ఇవ్వలేమన్న కోర్టు..

అప్రూవర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మాత్రమే కవితను అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని.. అయితే, ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2024 | 03:38 PMLast Updated on: Mar 22, 2024 | 3:38 PM

Delhi Excise Policy Case Supreme Court Denies Bail To Brs Leader Mlc Kavitha

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసులో తాము బెయిల్ ఇవ్వలేమని, బెయిల్ కోసం మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. సుప్రీం జడ్జిలు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం కవిత పిటిషన్ విచారించింది.

Alapati Raja: టీడీపీకి షాక్‌.. ఆలపాటి రాజీనామా! ఏ పార్టీలో చేరబోతున్నారంటే..

కవిత తరఫున సుప్రీం సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కవిత విషయంలో ఈడీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. కవితను ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా పేర్కొన్నారని.. కవితకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం ఒక్కటి కూడా లేదని కపిల్ కోర్టుకు తెలిపారు. అప్రూవర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మాత్రమే కవితను అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని.. అయితే, ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. కేసు విచారణ వేగంగా జరిగేలా చూడాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. రాజకీయ నేతలెవరైనా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని, ఇలాంటి పిటిషన్‌ల విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని కోర్టు పేర్కొంది. బెయిల్ కోసం అందరూ ముందుగా ట్రయల్ కోర్టులనే ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. దీంతో ఇప్పుడు కవిత.. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.

ఈ కేసుకు సంబంధించి ఈడీకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్టు చేయగా.. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈ కస్టడీ శనివారంతో ముగియనుంది. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.