SUKHESH LETTER : అక్కా… వెల్కమ్ టు తిహార్ జైల్

కవితక్కా... వెల్కమ్ టు తిహార్ జైల్ (Tihar Jail) అని స్వాగతం చెబుతున్నాడు. మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. తిహార్ జైల్లోనే ఉన్న సుఖేష్ మళ్ళీ ఓ లెటర్ రిలీజ్ చేశాడు. ఈ లెటర్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా కవిత అక్రమ సంపాదన... విదేశాల్లో ఎక్కడెక్కడ దాచిందీ సంచలన విషయాలు బయటపెట్టాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2024 | 11:14 AMLast Updated on: Mar 19, 2024 | 11:14 AM

Delhi Liquor Case To Tihar Jail Sukesh Chandrasekhar In Tihar Jail Welcomes Mlc Kavitha Who Was Arrested In Money Laundering Case

కవితక్కా… వెల్కమ్ టు తిహార్ జైల్ (Tihar Jail) అని స్వాగతం చెబుతున్నాడు. మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. తిహార్ జైల్లోనే ఉన్న సుఖేష్ మళ్ళీ ఓ లెటర్ రిలీజ్ చేశాడు. ఈ లెటర్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా కవిత అక్రమ సంపాదన… విదేశాల్లో ఎక్కడెక్కడ దాచిందీ సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆ వెయ్యి నెయ్యి డబ్బాల సంగతి కూడా ఈడీ తేలుస్తుందని అంటున్నాడు ముఖేష్.

కవిత తిహార్ జైలుకు రావడం ఖాయమని తాను గతంలో చెప్పిందే నిజమైందని అంటున్నాడు సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar). తిహార్ జైల్ క్లబ్ లో త్వరలో మీరు సభ్యులు కాబోతున్నారు. మీకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వెల్కమ్ టు తిహార్ జైల్ అంటూ సుఖేష్ ఓ లెటర్ రిలీజ్ చేశాడు. త్వరలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారన్నారు. కేజ్రివాల్ ను కాపాడే ప్రయత్నం చేయొద్దని కవితకు సలహా ఇచ్చాడు సుఖేష్. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. ఈ కేసులో కావాల్సినన్ని సాక్షాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు అని తెలిపాడు సుఖేష్ చంద్రశేఖర్.

ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ (political) కక్షసాధింపు అంటూ కవిత చెప్పిన కల్లిబొల్లి కబుర్లన్నీ అబద్ధాలని తేలింది. నిజం బయటికొచ్చింది. చేసిన పనులకు కర్మ ఫలం ఇప్పుడు వెంటాడుతోందని కామెంట్ చేశాడు సుఖేష్. నిజం శక్తి ఏంటో ఇప్పటికైనా కవిత తెలుసుకోవాలి. నన్ను ఎవరూ ఏమి చేయలేరని అనుకునేవారు. కానీ దేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైనది అంటున్నాడు సుఖేష్ చంద్రశేఖర్. ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. అందుకు కావాల్సినన్ని సాక్ష్యాలు, ఆధారాలు కూడా ఉన్నాయంటున్నాడు సుఖేష్.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో వచ్చిన డబ్బులను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విదేశాలకు తరలించినట్టు లెటర్లో ఆరోపించాడు సుఖేష్. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి… సింగపూర్, హాంకాంగ్, జర్మనీల్లో దాచుకున్న అక్రమ సొమ్ము ఇప్పుడు బయటపడుతుందని తెలిపాడు. మీ వాట్సాప్ సంభాషణలపై దర్యాప్తు జరుగుతోందని కవితను హెచ్చరించాడు. తాను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయని తెలిపాడు. ఇక నువ్వు బయటపడే మార్గమే లేదు అక్కా అని కవితను ఉద్దేశించి లెటర్లో రాశాడు సుఖేష్.

నేను గతంలో రిలీజ్ చేసిన లెటర్ లో రాసినట్టే తెలంగాణలో జరిగిందని సుఖేష్ రాశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందనీ… తిహార్ క్లబ్‌లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని… ఈ రెండూ ఇప్పుడు నిజమైనట్టు తెలిపాడు. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయిందన్నాడు సుఖేష్. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలు బయటకు వస్తాయని తెలిపాడు.

కవితకు జైల్‌లో లగ్జరీ జీవితం అందించేందుకు కేజ్రీవాల్ అన్ని ఏర్పాట్లు చేసే ఉంటారని లెటర్లో రాశాడు సుఖేష్. ఈడీ, సీబీఐ కన్‌ఫ్రంటేషన్ లో భాగంగా త్వరలోనే ముఖాముఖిగా మిమ్మల్ని చూస్తానంటూ… మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్కా అని లెటర్ లో రాశాడు సుఖేష్. సినిమా ఇంకా మిగిలే ఉందనీ… నెక్ట్స్ అరెస్ట్ కేజ్రీవాల్ అనీ… దాంతో క్లైమాక్స్‌కు చేరుతుందని తెలిపాడు సుఖేష్ చంద్రశేఖర్. సుఖేష్ లెటర్ తో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ అక్రమ సంపాదన విదేశాలకు వెళ్ళిపోయిందన్న అనుమానాలు వస్తున్నాయి. ఇందులో కవిత ఒక్కరికే ప్రమేయం ఉందా లేదంటే బీఆర్ఎస్ పార్టీకీ సంబంధం ఉందా అన్న దానిపై ఈడీ విచారణ చేయాల్సి ఉంది.