శ్రేయాస్ వైపు ఢిల్లీ చూపు కెప్టెన్సీ ఇచ్చేందుకు రెడీ

ఐపీఎల్ మెగావేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్స్ వచ్చేయడంతో ఈ సారి అన్ని జట్ల కూర్పూ మారిపోవడం ఖాయమైంది. అలాగే కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు కూడా రాబోతున్నారు. రిషబ్ పంత్ ను వదిలేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు కొత్త సారథిని వెతుక్కుంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 3, 2024 | 01:05 PMLast Updated on: Nov 03, 2024 | 1:05 PM

Delhi Looks At Shreyas Ready To Give Captaincy

ఐపీఎల్ మెగావేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్స్ వచ్చేయడంతో ఈ సారి అన్ని జట్ల కూర్పూ మారిపోవడం ఖాయమైంది. అలాగే కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు కూడా రాబోతున్నారు. రిషబ్ పంత్ ను వదిలేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు కొత్త సారథిని వెతుక్కుంటోంది. కోల్ కత్తా ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ పై ఢిల్లీ కన్నేసినట్టు తెలుస్తోంది. శ్రేయాస్ ను వేలంలో దక్కించుకునేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి అతన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వేలంలో కొనేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఢిల్లీ ఫ్రాంచైజీ అధికారి ఒకరు చెప్పారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ని కోల్ కత్తా12.25 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సారథిగా కోల్ కత్తాను బాగానే నడిపించిన శ్రేయాస్ 2024 సీజన్ లో ఆ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. బ్యాట్ తోనూ నిలకడగా రాణించిన అయ్యర్ ను కేకేఆర్ వదిలేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అయితే శ్రేయాస్ అయ్యర్ పెద్ద మొత్తం అడగడంతోనే వదిలేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ గ్రూప్‌తో శ్రేయాస్ అయ్యర్ టచ్‌లో ఉన్నాడని, అతను కోరినంత ఇచ్చేందుకు డీసీ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రేయాస్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయ్యర్ కెప్టెన్సీలో 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొట్టమొదటిసారిగా ఫైనల్ చేరింది . అయితే గాయం కారణంగా 2021 సీజన్‌ ఫస్ట్ ఫేజ్‌కి అయ్యర్ దూరమయ్యాడు . దీంతో రిషబ్ పంత్ ను సారథిగా పగ్గాలు అందుకున్నాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నా, రిషబ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించడంతో ఆ జట్టుకు శ్రేయాస్ గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు మళ్ళీ శ్రేయాస్ నే కెప్టెన్ గా నియమించాలని ఢిల్లీ భావిస్తోంది.

శ్రేయాస్ అయ్యర్ కోసం మిగిలిన టీమ్స్ కూడా పోటీ పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ కమ్ బ్యాటర్ కోసం చూస్తున్న పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ కూడా శ్రేయాస్ పై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ రెండు మూడు ఫ్రాంచైజీలు పోటీ పడితే, శ్రేయాస్ కు 18 కోట్ల వరకు అమ్ముడయ్యే ఛాన్సుంది. ఓవరాల్ గా తన ఐపీఎల్ కెరీర్ లో శ్రేయాస్ అయ్యర్ 115 మ్యాచ్ లు ఆడి 3 వేల 127 పరుగులు చేశాడు. దీనిలో 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడి 351 రన్స్ చేసిన శ్రేయాస్ అయ్యర్ వేలంలో డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అన్ని అనుకూలిస్తే మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగానే శ్రేయాస్ ను చూడొచ్చు.