Festival Effect: ఈ దసరా మరింత స్పెషల్ గురూ.. కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలు 18 – 20 శాతం వరకూ పెరిగే ఛాన్స్..
ఇకవైపు సాంప్రదాయ పండుగలు, మరో వైపు క్రికెట్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రపంచ కప్ క్రికెట్ సంబరం ఒకే మాసంలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వస్తువుల క్రయవిక్రయాల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.
పండుగ అంటే నాటి ప్రపంచం ఆలయానికి వెళ్లడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, పిండి వంటలు చేయడం, లాంటివి చూస్తూ ఉంటారు. కానీ నేటి తరంలో ఇవన్నీ కనపడటంలేదు. క్రమక్రమంగా కనుమరుగై పోతున్నాయి. పండుగకు వారం పదిరోజుల ముందే ఆన్లైన్ షాపింగ్ పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు యవత. ఏ వస్తువు ఎంత ధరకు వస్తుందో.. ఎంత డిస్కౌట్ ఇస్తారు అనే దానిపైనే ఆలోచన పెడుతున్నారు. దీంతో ఇ-కామర్స్ బిజినెస్ తారా స్థాయికి చేరింది. బట్టలు మొదలు షూ వరకూ, బొట్టు బిళ్లల నుంచి నైల్ పాలిష్ వరకూ అన్నీ ఆన్లైన్లోనే విక్రయిస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని ఇ – కామర్స్ వేదికల్లో వస్తువుల విక్రయం 18-20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.
పెరుగుదలకు కారణం ఇదే..
సాధారణంగా పండుగల సీజన్ అంటే బిగ్ బిలియన్ డేస్.. అమెజాన్ ప్రైమ్ ఆఫర్స్ వంటివి అందుబాటులోకి తీసుకొస్తాయి దిగ్గజ కంపెనీలు. దీని ప్రభావం ఆన్లైన్, ఆఫ్ లైన్ షాపింగ్ పై పడనుంది. ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. పైగా ప్రపంచ కప్ సీజన్ నడుస్తోంది. దీంతో ఎలక్ట్రానికి వస్తువులకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అటు పండుగలు, ఇటు క్రికెట్ సంబరాల కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు 18-20 శాతం వరకూ డిమాండ్ పెరగనున్నట్లు తెలుస్తోంది. పైగా మూడున్నర దశాబ్దాల తరువాత పండుగలు, ప్రపంచ కప్ సీజన్ రెండూ ఒకేసారి వచ్చాయిన పేర్కొన్నారు మార్కెట్ నిపుణులు.
వీటికి మంచి గిరాకీ..
పెద్ద ఎల్ఈడీ, క్యూ ఎల్ఈడీ, ప్రీమియం ఆల్ట్రా టీవీలు, బ్లాటూత్ స్పీకర్స్, హోం థియేటర్లు, సౌండ్ బార్లు, వైర్ లెస్ హెడ్ సెట్స్, ఇయర్ బర్డ్స్, ఏసీలు, లాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు కొనుగోలు విక్రయాలు పెరిగే అవకాశం ఉన్నట్లు పలు ప్రముఖ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత జనరేషన్ లో వినోదాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా పాత టీవీలను పక్కన పెట్టి స్మార్ట్ టీవీల వైపుకు మొగ్గు చూపుతున్నారు. అందులో ఇంటర్ నెట్ తో వివిధ సినిమా, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు మంచి ప్యాకేజీలో లభించడంతో డీటీహెచ్ కి స్వస్థి పలికి ఓటీటీల వైపుకు మొగ్గు చూపుతున్నారు. దీని కారణంగా మంచి పెద్ద టీవీలను, స్మార్ట్ హోం అప్లిఎన్సెస్ వైపుకు మొగ్గు చూపుతున్నట్లు సోనీ, ఎల్ జీ కంపెనీల ప్రతినిథలు వివరించారు.
కార్లకు కూడా తగ్గని డిమాండ్..
దసరా అంటే గృహోపకరణ సామాగ్రితో పాటూ వాహనాలు కొనుగోలు చేస్తారు. టూవీలర్లు, ఫోర్ వీలర్లను విరివిగా కొంటూ ఉంటారు. అందులో విజయదశమి అంటే మరింత సెంటిమెంట్ గా భావించి అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో విలాసవంతమైన కార్లకు కాస్త డిమాండ్ పెరగనున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందులోనూ ప్రముఖ కంపెనీలైన ఆడి, మెర్సిడెజ్ బెంజ్, బీఎం డబ్యూ హై ఎండ్ కార్లకు మంచి గిరాకీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. దీనికి కారణం కోవిడ్ తరువాత ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి గతులు గత ఏడాది కంటే కూడా ప్రస్తుతం మెరుగుపడ్డాయి. దీంతో వ్యాపారవేత్తలు తమ విలాసాలకు కాస్త అవకాశాలు ఇస్తున్నారు. దీనికి సరైన గణాంకాలు కూడా వెల్లడించారు బెండ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్. గతంలో ఎన్నడూ లేని విధంగా 2023లో విలాసవంతమైన కార్లకు డిమాండ్ బాగా పెరిగింది అని చెప్పుకొచ్చారు. ఈ వాతావరణం ఇలాగే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
T.V.SRIKAR