America: చైనా గుప్పెట్లో అమెరికా రహస్యాలు..? మాల్వేర్ సృష్టించే అరాచకం ఇదేనా..!
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా రక్షణరంగానికి ముప్పు వాటిల్లబోతుందా.. చైనా తన సాంకేతిక తంత్రంతో అమెరికాను అధిగమించే ప్రయత్నం చేస్తుందా.. వీటన్నిటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిజమనే సంకేతాలను ఇస్తుంది. అసలు చైనా.. అమెరికా రక్షణ రంగంలో ఎలా అడుగుపెట్టింది. దీనిని ఎలా నియంత్రిస్తుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలోనే రక్షణ రంగం మొదలు సాంకేతికత వరకూ అన్నింటా అగ్రగామిగా నిలిచింది అమెరికా. అలాంటి అమెరికా పరికరాల్లో చైనా ఓ మాల్ వేర్ ని చొప్పించినట్లు తాజాగా వెల్లడవుతున్న సమాచారం. దీనిని సీనియర్ సైనికరంగ ఉన్నతాధికారులు, సీనియర్ నిపుణులే విశ్వసిస్తున్నారంటే దీని స్థాయి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దీనిపై కాంగ్రెస్ అధికారి స్పందించారు. న్యూయార్క్ టైమ్స్ అనే మాధ్యమంలో ప్రస్తావించారు.
చైనా హ్యాకర్లు చొప్పించిన మాల్వేర్లు:
అమెరికా రక్షణశాఖ ఆధీనంలో ఉన్న పరికరాలలో చైనా హ్యాకర్లు ఒక చిన్న పరిమాణంలో ఉండే కంప్యూటర్ కోడ్ ను చొప్పించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల అమెరికా రక్షణ రంగంలోని పూర్తి వివరాలు తెలిసిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ కోడ్ ముఖ్యంగా సైన్యంలోని నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్ పై ఎక్కవ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. అలాగే క్రమక్రమంగా కమ్యూనికేషన్ లోకి విస్తరించి సైన్యానికి నీటి సరఫరా అందించే వ్యవస్థల్లో దీనిని ఏర్పాటు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇలా చేయడం వల్ల అమెరికా యుద్దం చేసే సమయంలో ఒకవేళ సంక్షోభం ఏర్పడితే చైనా హ్యాకర్లు దీనిని అదునుగా భావించి సైన్యాన్ని సరఫరా చేయడంలో అంతరాయం కల్గించే ప్రమాదం ఉంది.
కమ్యూనికేషన్ కేంద్రంగా చైనా అస్త్రాలు:
చైనా అమెరికా మధ్య ఉన్న వివాదం ఇప్పటికే ముదిరిముదిరి పాకాన పడింది. ఇలాంటి సమయంలో చైనా పై ఇలాంటి విషయం వెలుగులోకి వచ్చింది. దీనపై అమెరికా ఎలా స్పందిస్తుందో అన్న అందోళన ప్రతి ఒక్కరిలో మొదలైంది. ఇదివరకే అమెరికా ఎయిర్ ఫోర్స్ బేస్ అయిఉన్న గువాంలో తొలిసారి మైక్రోసాఫ్ట్ ఒక అనుమానాస్పద కోడ్ ను గుర్తించింది. ఆ తర్వాత అగ్రరాజ్యంలోని కీలక ప్రాంతాలలో ఉన్న కంపూటర్లలో వీటిని గుర్తించారు. ఇప్పటికే చైనా హ్యాకింగ్ గ్రూప్ అయిన వోల్ట్ టైపూన్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్ లోని ఓ అధికారి సంచలన విషయాన్ని బయటపెట్టాడు. సైనిక పరిసరాల్లో చైనాకు సంబంధించిన టైంబాంబు లాంటి మాల్ వేర్ ఒకటి ఉందన్నారు. ఇది మిలటరీ విస్తరించి ఉన్న ప్రాంతాలలో నీరు, విద్యుత్, నెట్వర్క్ లాంటి కమ్యూనికేషన్లను పనిచేయకుండా నియంత్రించగలదని ఆరోపించారు. దీంతో సైనిక బలం, పనితీరు క్రమక్రమంగా మందగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి మాల్ వేర్ కేవలం అమెరికాలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వాదనలన్నింటికీ బలం చేకూర్చేలా చైనా హ్యాకర్లు అమెరికా పై ప్రదర్శిస్తున్న తీరును మరో సారి గుర్తుచేశారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దం:
నికోలస్ బర్న్స్ అనే అమెరికా రాయబారి మెయిల్ హ్యాక్ అయినట్లు మైక్రోసాఫ్ట్ గతవారమే గుర్తించింది. దీనికంటే ముందుగా ఈనెల ప్రారంభంలోనే దాదాపు 25 సంస్థల మెయిల్స్ ను చైనా హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా ఈ చైనా మాల్వేర్ పై అమెరికా సైనికాధికారులు సిచ్యూవేషన్ రూంలో మీటింగ్ ఏర్పాటుచేశారు. అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఆడమ్ హోడ్జ్ తాజాగా స్పందించారు. “అమెరికాలోని ప్రదానమైన మౌళిక సదుపాయాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా జో బైడెన్ ప్రభుత్వంలోని ప్రత్యేక కార్యవర్గం పనిచేస్తున్నట్లు తెలిపారు. నీటిని అందించే పైపులైన్లు మొదలు రైల్వే, ఎయిర్ వేస్ రంగాన్ని కాపాడేందుకు అవసరమైన విధానాలను ప్రత్యేక బృందాలతో చర్చించి వారితో సమన్వయం చేసుకుంటున్నట్లు” వివరించారు.
T.V.SRIKAR