నాగార్జునకు టైం ఇవ్వకుండా ప్లాన్ చేసారా…?
హైదరాబాద్ లో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా... ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా నేలమట్టం చేసింది. ఈ రోజు ఉదయం నుంచి ఈ ఆపరేషన్ చేపట్టిన అధికారులు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు.
సాధారణంగా ఏదైనా అక్రమ కట్టడం కూల్చాలి అంటే ముందుగా నోటీసులు ఇచ్చి తర్వాత కొంత సమయం ఇచ్చి యాక్షన్ తీసుకుంటారు. అయితే ఈ సమయంలో తమ కట్టడాలను ప్రభుత్వం కూల్చకుండా స్టే తెచ్చుకోవడానికి కోర్ట్ కి వెళ్తూ ఉంటారు. సామాన్యులకు అయితే అంత శక్తి ఉండదు గాని ధనవంతులకు అయితే కచ్చితంగా ఉంటుంది. ఇటీవల కేటిఆర్ కు చెందిన జన్వాడ ఫాం హౌస్ ను ఇలాగే కూల్చి వేస్తామని నోటీసులు ఇస్తే హైకోర్ట్ కి వెళ్ళారు. దీనితో అది ఆలస్యం అయింది. తర్వాత హైడ్రాకె అనుకూలంగా హైకోర్ట్ తీర్పు చెప్పింది.
అవన్నీ దృష్టిలో పెట్టుకున్న హైడ్రా అధికారులు సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో పక్కగా అడుగులు వేసారు. ఏ మాత్రం నాగార్జునకు కోర్ట్ కు వెళ్ళే టైం ఇవ్వలేదు. అత్యాధునిక మిషనరీతో కన్వెన్షన్ సెంటర్ కి ఇవాళ ఉదయమే చేరుకున్న అధికారులు కన్వెన్షన్ సెంటర్ కార్యాలయం గోడకు నోటీసులను అంటించి కూల్చివేతలు చేపట్టారు. ఈ విషయంలో చాలా గోప్యతగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం ఉందని భావించిన హైడ్రా టీం అందుకోసమే కూల్చివేతలకు సంబంధించి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని తెలుస్తోంది.
కూల్చివేతల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా అధికారులు… ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా నేలమట్టం చేసారు. ఈ రోజు ఉదయం నుంచి ఈ ఆపరేషన్ చేపట్టిన అధికారులు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. కన్వెన్షన్ సెంటర్లోని రెండు హాళ్లు పూర్తిగా నేలమట్టం చేసారు. కొన్ని గంటల్లోనే కన్వెన్షన్ సెంటర్లోని 2 హాళ్ళను సిబ్బంది కూల్చివేయడంతో కూల్చివేత పూర్తి అయింది. దాదాపుగా నాలుగు గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో ప్రభుత్వాల తీరుని తప్పుబట్టారు.