ఓపెనింగ్ కాంబినేషన్ పై డైలమా, భారత్ తుది జట్టు ఇదేనా ?
ఆస్ట్రేలియా టూర్ లో రెండో సవాల్ కు భారత్ రెడీ అవుతోంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ పింక్ బాల్ టెస్ట్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి.
ఆస్ట్రేలియా టూర్ లో రెండో సవాల్ కు భారత్ రెడీ అవుతోంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ పింక్ బాల్ టెస్ట్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ జట్టులోకి తిరిగి రావడంతో పెర్త్ టెస్టులో ఆడిన పడిక్కల్ , ధృవ్ జురెల్ పై వేటు పడనుంది. అయితే ఈ రెండో టెస్ట్ కోసం ఓపెనింగ్ కాంబినేషన్ పై డైలమా కొనసాగుతోంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ లేకపోవడంతో జైశ్వాల్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్ లో వీరి జోడీ విజయవంతమైంది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో మ్యాచ్ లోనూ జైశ్వాల్ , రాహులే ఓపెనర్లుగా దిగారు. అటు రోహిత్ శర్మ అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో జైశ్వాల్ కు తోడుగా ఓపెనర్ ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.
జైశ్వాల్ తో కలిసి రోహితే ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే కెఎల్ రాహుల్ మిడిలార్డర్ లో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్ డౌన్ లో శుభ్ మన్ గిల్ , నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తారు. ఒకవేళ రాహుల్ ఓపెనర్ గా వస్తే మాత్రం రోహిత్ ఐదో స్థానంలో ఆడతాడు. ఎందుకంటే కోహ్లీని నాలుగో స్థానం నుంచి మార్చే అవకాశాలు లేవు. పింక్ బాల్ మ్యాచ్ కావడంతో పేస్ ఎటాక్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో బూమ్రాతో పాటు సిరాజ్ , హర్షిత్ రాణాకు చోటు దక్కనుంది. సిరాజ్ తొలి మ్యాచ్ ఆకట్టుకోగా… ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో హర్షిత్ రాణా అదరగొట్టాడు. 4 వికెట్లతో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక మరో పేస్ ఆల్ రౌండర్ గా నితీశ్ కుమార్ రెడ్డి కొనసాగడం ఖాయమే. ఈ సిరీస్ తో టెస్ట్ అరంగేట్రం చేసిన నితీశ్ ఆకట్టుకుంటున్నాడు. పెర్త్ టెస్టులో బ్యాట్ తోనూ సత్తా చాటిన నితీశ్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ మెరుపులు మెరిపించాడు. అటు స్పిన్ ఆల్ రౌండర్ గా మాత్రం ఒకరికే చోటు దక్కనుంది. అశ్విన్, జడేజా, వాషింగ్టన్ సుందర్ లో ఎవరు తుది జట్టులో ఉంటారనేది చూడాలి.
ఎక్స్ పీరియన్స్ పరంగా రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్‌ను తప్పిస్తారా అనేది అనుమానమే. ఒకవేళ జడేజాను ఆడించాలనుకుంటే మాత్రం సుందర్ బెంచ్‌కు పరిమితమవుతాడు.
ఈ మూడు మార్పులు మినహా జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. భారత్ ముగ్గురు పేసర్లతో పాటు ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగనుంది. కానీ రోహిత్ , గిల్ ఎంట్రీతో తుది జట్టు కూర్పు కోచ్ గంభీర్ కు తలనొప్పిగానే మారింది. సిరీస్ లో ఆధిక్యం పెంచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తున్న టీమిండియా అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతుందని చెప్పొచ్చు.