సునీతా విలియమ్స్‌ను సముద్రంలోనే ఎందుకు దించారో తెలుసా..?
దాదాపు 9 నెలల నిరీక్షణకు తెర పడింది. కోట్ల మంది ఎదురుచూస్తున్న ఆ వీర వనిత ఎట్టకేలకు భూమి మీద అడుగు పెట్టింది. స్పేస్ నుంచి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమి మీద ల్యాండ్ అయ్యారు.

దాదాపు 9 నెలల నిరీక్షణకు తెర పడింది. కోట్ల మంది ఎదురుచూస్తున్న ఆ వీర వనిత ఎట్టకేలకు భూమి మీద అడుగు పెట్టింది. స్పేస్ నుంచి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమి మీద ల్యాండ్ అయ్యారు. అయితే ల్యాండింగ్ కోసం నేలను కాకుండా సముద్రాన్ని నాసా ఎందుకు ఎంచుకుందన్న డౌట్ ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో ఉంది. దీనికి చాలా కారణాలున్నాయి. స్పేస్ క్యాప్సుల్‌ను నేల మీద ల్యాండ్ చేయడం కంటే నీటి మీద ల్యాండ్ చేయడం క్రాష్ నుంచి తప్పిస్తుంది. ల్యాండింగ్ సమయంలో హార్డ్ ల్యాండింగ్ అయ్యే ప్రమాదాలు ఉండటం సహజం. అలాంటి సమయంలో నేల మీద కాకుండా నీటి మీద దించితే.. క్యాప్సుల్ క్రాష్ అవ్వకుండా ఉంటుంది. నీటి సాంద్రత, చిక్కదనం తక్కువ. అందువల్ల ల్యాండైన వ్యోమనౌకకు కూషన్‌లా ఇది పనిచేస్తుంది. అందువల్ల వ్యోమనౌక దెబ్బతినే ముప్పు చాలా తక్కువ. దాంతో పాటు సముద్రం చాలా విశాలంగా ఉంటుంది. కాబట్టి అత్యంత కచ్చితమైన ప్రదేశంలో ల్యాండింగ్ అయ్యే సౌకర్యం లేని వ్యోమనౌకలకు ఇది ప్రయోజనకరం.
అది నిర్దేశిత ప్రదేశంలో కాక ఒకింత పక్కకు వెళ్లినా ఇబ్బంది ఉండదు. ల్యాండింగ్ తర్వాత సహాయ బృందాలు సులువుగా వ్యోమనౌక ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు. వ్యోమగాములను క్షేమంగా బయటకు తీసుకురావొచ్చు. అందుకే నేల మీద క్యాప్సుల్‌ను ల్యాండ్ చేయడం కంటే నీటి మీద ల్యాండ్ చేయడమే ఉత్తమం. అంతరిక్షయాత్రలు ముగించుకొని భూమికి తిరిగొచ్చే వ్యోమనౌకల ల్యాండింగ్ విషయంలో ఒక్కో దేశం తీరు ఒక్కోలా వ్యవహరిస్తోంది. రష్యా తమ స్పేస్ క్యాప్సూల్‌ను నేలపై దించుతుండగా. అమెరికా మాత్రం సముద్ర జలాల్లో దించుతోంది. వ్యోమనౌకలను సురక్షితంగా దించడానికి అనువైన సముద్రం లేకపోవడం వల్ల రష్యా నేలపైనే ల్యాండింగ్ నిర్వహిస్తోంది. ఆ దేశానికి ల్యాండింగ్‌కు వీలు కల్పించే బేరెంట్స్ సముద్రం, లాప్టెవ్ సముద్రం, తూర్పు సైబీరియా సముద్రం లాంటివి ఉన్నాయి. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు వ్యోమనౌకల ల్యాండింగ్‌కు అవరోధంగా మారాయి. ఆ ప్రదేశాల్లో నీళ్లు గడ్డకట్టుకుపోయే రేంజ్‌లో చలి ఉంటుంది. ఒకవేళ వ్యోమనౌకలోకి నీరు లీకైతే, వ్యోమగాములు గడ్డకట్టుకుపోతారు. వ్యోమనౌకను వెలికితీయడం కూడా సహాయ బృందాలకు కష్టమవుతుంది. కొన్నిచోట్ల అనువైన ప్రదేశాలు ఉన్నప్పటికీ.. అవి అంతర్జాతీయ సరిహద్దులకు చేరువగా ఉన్నాయి. అలాంటిచోట్ల ల్యాండింగ్కు రష్యా సుముఖంగా లేదు. మరోపక్క ఆ దేశంలో జనావాసాలు లేని భూభాగాలు భారీగా ఉన్నాయి. అందువల్ల ల్యాండింగ్’ కోసం వాటిని ఉపయోగించుకుంటోంది. రెట్రో రాకెట్లు, పారాచూట్ల సాయంతో వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తూ నెమ్మదిగా వ్యోమనౌకలను దించుతోంది. చైనా కూడా ఇదే తరహాలో ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో నేలపైనే ల్యాండింగ్ నిర్వహిస్తోంది. భౌగోళికంగా తనకున్న వెసులుబాట్ల వల్ల అమెరికా సముద్రాల్లో ల్యాండింగ్‌ను ఎంచుకుంటోంది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించాక.. పారాచూట్లతో వేగాన్ని తగ్గించుకొని వ్యోమగాములకు హానికలగని రీతిలో సముద్రంలో ల్యాండింగ్ నిర్వహించొచ్చు. చివరిదశలో ప్రత్యేకంగా ఇంజిన్లు వాడాల్సిన అవసరంలేదు. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు అందుబాటులో ఉండటం, అక్కడ భారీగా తమ నౌకాదళం మోహరించి ఉండటం వంటి కారణాల వల్ల నేలపై దించే ఆలోచనను అమెరికా విరమించుకుంది. 2011 వరకూ ఆ దేశానికి సేవలందించిన స్పేస్ షటిళ్లు మాత్రమే రన్వేలపై విమానాల్లా దిగాయి. గతంలో జెమినీ, అపోలో, మెర్క్యూరీ, నేడు క్రూ డ్రాగన్ వంటి స్పేస్ క్యాప్సూళ్‌లు సముద్రాల్లోనే ల్యాండ్ అవుతున్నాయి. గగన్‌యాన్ పేరిట మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న భారత్ కూడా ఇదే పద్ధతిలో సముద్ర ల్యాండింగ్‌ను ఎంచుకుంది.