నన్ను టెస్ట్ ప్లేయర్ అనొద్దు, బ్యాట్ తో రహానే వార్నింగ్
అజంక్య రహానే... ఈ పేరు చెప్పగానే మంచి టెస్ట్ ప్లేయరే గుర్తొస్తాడు.. తన క్లాసిక్ బ్యాటింగ్ తో రెడ్ బాల్ క్రికెట్ లో చాలాసార్లు జట్టును కాపాడాడు.. రహానే వన్డే, టెస్టులకు మాత్రమే పనికొస్తాడు.... టీ ట్వంటీలకు అతని బ్యాటింగ్ పనికిరాదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది...
అజంక్య రహానే… ఈ పేరు చెప్పగానే మంచి టెస్ట్ ప్లేయరే గుర్తొస్తాడు.. తన క్లాసిక్ బ్యాటింగ్ తో రెడ్ బాల్ క్రికెట్ లో చాలాసార్లు జట్టును కాపాడాడు.. రహానే వన్డే, టెస్టులకు మాత్రమే పనికొస్తాడు…. టీ ట్వంటీలకు అతని బ్యాటింగ్ పనికిరాదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది… కానీ ఆ అభిప్రాయానికి చెక్ పెట్టే పనిలో రహానే సక్సెస్ ఫుల్ గా ముందుకెళుతున్నాడు. ఐపీఎల్ లో గత రెండు సీజన్లలోనూ బ్యాటింగ్ ఛాన్స్ వచ్చిన ప్రతీసారీ భారీ షాట్లు ఆడుతూ వింటేజ్ రహానే కాదని నిరూపించాడు. ఇప్పుడు జాతీయ జట్టుకు దూరమైనప్పటకీ… దేశవాళీ టీ ట్వంటీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. తాను టెస్ట్ ప్లేయర్ ను మాత్రమే అంటూ వినిపిస్తున్న కామెంట్స్ కు బ్యాట్ తోనే దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తన బ్యాటింగ్ విధ్వంసంతో ముంబైని ఫైనల్ కు తీసుకెళ్ళాడు.
తాజాగా బరోడాతో జరిగిన మ్యాచ్ రహానే సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 2 పరుగుల తేడాతో టీ ట్వంటీ సెంచరీ చేజార్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రహానే విధ్వంసంతో బరోడా నిర్ధేశించిన 159 పరుగుల టార్గెట్ ను ముంబై కేవలం 17.2 ఓవర్లలోనే అందుకుంది. రహానే 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు. తృటిలో శతకం చేజారినా ఓవరాల్ గా ముంబై విజయంలో రహానేదే కీలకపాత్ర… నిజానికి ఈ టోర్నీ ఆరంభం నుంచే రహానే దుమ్మురేపుతున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రహానేనే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఈ ముంబై సీనియర్ బ్యాటర్ 8 మ్యాచ్ లు ఆడి 61కి పైగా యావరేజ్ తో 432 రన్స్ చేశాడు. దీనిలో ఐదు హాఫ్ సెంచరీలు ఉండగా.. రెండుసార్లు 90కి పైగా పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఈ టోర్నీలో ఇప్పటి వరకూ రహానే 42 ఫోర్లు, 19 సిక్సర్లు బాదేశాడు.
రహానే విధ్వంసంతో ముంబై మరోసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. రహానే కెప్టెన్సీలోనే రంజీ టైటిల్ సొంతం చేసుకున్న ముంబై ఇప్పుడు మరో దేశవాళీ టైటిల్ కు చేరువవడం విశేషం.. అటు రహానేను ఇటీవల జరిగిన మెగావేలంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ కోటిన్నర బేస్ ప్రైస్ కు కొనుగోలు చేసింది. రహానే ఇప్పుడు భారత జట్టుకు దూరమైనా… అతనికి రాజస్థాన్ రాయల్స్ కూడా నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో రహానే 185 మ్యాచ్‌ల నుంచి 30.14 సగటుతో 4642 ఐపీఎల్ పరుగులు చేశాడు. ఈ సారి 2025 ఐపీఎల్ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గా రహానే ముందున్నట్టు తెలుస్తోంది. వెంకటేశ్ అయ్యర్ ను కూడా కోల్ కత్తా 23 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అనుభవం పరంగా రహానేకే కెప్టెన్సీ అప్పగించే ఛాన్సుంది.