ఆస్ట్రేలియా టూర్ లో ఈ సారి టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. కంగారూ గడ్డపై ఫేవరెట్ గా అడుగుపెట్టిన భారత్ చెత్త ప్రదర్శనతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. తొలి టెస్ట్ గెలిచినా తర్వాత చేతులెత్తేసింది. ఫలితంగా 1-3తో ఓడిపోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తును కూడా చేజార్చుకుంది. బ్యాటర్ల వైఫల్యమే ఈ ఓటమికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో వీరిద్దరిపైనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రిటైర్మెంట్ టైమ్ వచ్చేసిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. అయితే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం రోహిత్ , కోహ్లీలకు అండగా నిలిచాడు. టీమిండియా ఓటమికి వీరిద్దరినీ నిందిస్తూ విమర్శించడం సరికాదన్నాడు. గతంలో వారు అద్భుత విజయాలు అందించారని గుర్తు చేశాడు. గత ఐదారేళ్లలో టీమిండియా ఏం సాధించిందో మరిచిపోకూడదన్నాడు. ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ వరుసగా విజయాలు సాధించారనీ, ఏ జట్టు కూడా ఇలాంటి విజయాల్ని సాధించినట్టు తనకు గుర్తులేదన్నాడు. చాలా మంది రోహిత్, కోహ్లీ గతంలో ఎలాంటి విజయాలు సాధించారోమర్చిపోయారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత క్రికెట్ లో వారిద్దరు గొప్ప క్రికెటర్లనీ, మనకంటే కూడా వాళ్లే ఈ ఓటమికి ఎక్కువగా బాధపడతారని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే సిడ్నీ టెస్ట్ లో రోహిత్ శర్మ తనంతట తానుగా తప్పుకోవడాన్ని ప్రశంసించాడు. ఇది చాలా పెద్ద విషయమనీ.. గతంలో ఏ కెప్టెన్ ను కూడా ఇలా చూడలేదన్నాడు. అది రోహిత్ శర్మ గొప్పతనమని చెప్పిన యువీ..ఓడినా, గెలిచినా అతడు ఎప్పటికీ గొప్ప సారథిగా కితాబిచ్చాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయం కంటే న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడం తనను బాధించిందని చెప్పాడు. ఎందుకంటే సొంత గడ్డపై 0-3 తేడాతో ఓడిపోవడం జీర్ణించుకోలేమని చెప్పుకొచ్చాడు. రెండు సార్లు విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియాపై ఓడిపోవడం పెద్దగా ఇబ్బంది ఉండదని, ఎందుకంటే చాలా ఏళ్లుగా ఆసీస్ గొప్పగా ఆడుతోందన్నాడు. కాగా ఈ ఓటమి నుంచి టీమిండియా కచ్చితంగా పుంజుకుంటుందని తాను నమ్ముతున్నట్టు యువరాజ్ చెప్పాడు. కోచ్ గా గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ గా అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా ప్రస్తుత క్రికెట్ లో అద్భుతమైన వాళ్లన్నాడు. భారత జట్టు ముందుకు వెళ్ళేందుకు ఏం చేయాలో అది చేస్తారని అభిప్రాయపడ్డాడు.[embed]https://www.youtube.com/watch?v=S_5BzgSpq3s[/embed]