IAS Puja : పూజా ఇలా దొరికిపోయావా ? ఓవరాక్షన్ చేస్తే అంతే మరి..
మహారాష్ట్రకు చెందిన ట్రైనీ IAS అధికారి డాక్టర్ పూజా ఖేద్కర్ ఆత్రం ఎక్కువ. ఆమె ఇంకా ప్రొబేషన్ లోనే ఉంది... పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ గా ట్రైనింగ్ తీసుకుంటోంది.
మహారాష్ట్రకు చెందిన ట్రైనీ IAS అధికారి డాక్టర్ పూజా ఖేద్కర్ ఆత్రం ఎక్కువ. ఆమె ఇంకా ప్రొబేషన్ లోనే ఉంది… పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ గా ట్రైనింగ్ తీసుకుంటోంది. కానీ నేను కలెక్టర్ అయిపోయా… నన్ను గౌరవించాలి… అంటూ తెగ ఆరాటపడింది. అక్కడితో ఆగకుండా… రూల్స్ కి విరుద్ధంగా తన ఆడీ కారుకు రెడ్ – బ్లూ బీకన్ లైట్లు పెట్టించుకుంది. వీఐపీ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకుంది. ప్రభుత్వ కారు కాకపోయినా మహారాష్ట్ర ప్రభుత్వం అని తన కారుకు స్టిక్కర్ కూడా వేయించుకుంది. తనకు ప్రత్యేక సౌకర్యాలు కావాలనీ… నౌకర్లు, సిబ్బంది, కానిస్టేబుల్ వాళ్ళందర్నీ నా కింద అపాయింట్ చేయండి. అఫీషియల్ ఛాంబర్ కావాలి… ఇలా ఒక్కటేంటి… ఎన్నో గొంతెమ్మ కోరికలు కోరింది. పూజ ఇంకా IAS ట్రైనింగ్ లో ఉందన్న సంగతి కూడా మర్చిపోయింది. లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్స్, నేమ్ ప్లేట్, రాజముద్ర, ఇంటర్ కామ్ ఏర్పాటు చేయాలంటూ… రెవెన్యూ అసిస్టెంట్ కి ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇక ఆమె గారి తండ్రి… పూజ కంటే… నాలుగు ఆకులు ఎక్కువ చదివాడు. ఆయన రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆయన కూడా నా కూతురు ఏవి అడిగితే అవి ఇచ్చేయండి… అంటూ కలెక్టరేట్ అధికారులపై ఒత్తిడి చేయించారు.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రొబేషన్ పీరియడ్ లో… అంటే ట్రైనింగ్ లో ఉన్న IAS లకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ పూజ ఖేద్కర్ కి మాత్రం.. ఉద్యోగం వచ్చింది… వెంటనే కలెక్టర్ అయిపోవాలి అన్న ఆత్రం తప్ప మరొకటి లేదు. ఈ సంగతి తెలిసిన మహారాష్ట్ర ప్రభుత్వం… అంత ఓవరాక్షన్ వద్దమ్మా అంటూ… పూజాను … తీసుకెళ్ళి… వాశిమ్ జిల్లాలో పడేసింది… ప్రొబేషన్ టైమ్ పూర్తయ్యేదాకా… అక్కడ సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేయాలని ఆదేశించింది. అసలు ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్న IAS అధికారులు ఎవరైనా… తాము అన్ని శాఖలకు సంబంధించి పనులు నేర్చుకుంటారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ దగ్గర నుంచి ప్రతిశాఖకు వెళ్ళి ఎక్కడ ఏ పనులు జరుగుతాయో అవగాహన పెంచుకుంటారు. కానీ ఇవేమీ లేకుండా పూజా ఖేద్కర్ ఎందుకిలా విచిత్రంగా ప్రవర్తించిందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆమె కళ్ళతో పాటు మానసిక సమస్యలతో బాధ ఉన్నట్టు తేలింది.
ఆమె గతంలో మెడికల్ టెస్టులకు పోకుండా ఎగ్గొట్టింది. పూజ ఏకంగా ఆరు సార్లు డుమ్మా కొట్టిందట. ఏడో సారి వెళ్లినా.. అక్కడ పైపైనే టెస్టులు చేయించుకొని బయటపడింది. అసలు పూజను ఎలా ఎంపిక చేశారంటూ కమిషన్ అధికారులు ట్రైబ్యునల్ లో సవాల్ చేశారు. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు కూడా వచ్చింది. ఆ తర్వాత ఏదో రకంగా పూజా జాబ్ కన్ఫమ్ అయింది. ఇప్పుడు పూజ OBC సర్టిఫికెట్ పైనా కాంట్రోవర్సీ నడుస్తోంది. OBC కోటాలోనే పూజ 841వ ర్యాంక్ సంపాదించి IAS హోదాను పొందింది. దీనిపైనా విచారణ జరగాలని డిమాండ్ వస్తోంది. పూజ మెంటల్ కండీషన్ పై డౌట్స్ రావడం… ఆమె ఓవరాక్షన్ చూసి వివరాలను పంపమని PMO అధికారులు కూడా కోరారట. మొత్తానికి ట్రైనింగ్ లోనే కలెక్టర్ హోదా వెలగబెట్టాలనుకొని ఓవరాక్షన్ చేసిన పూజ ఖేద్కర్ కి ఉన్న ఉద్యోగం ఊడేలా ఉంది.