Indians In Canada: కెనడాలో భారతీయుల పరిస్థితి దారుణం.. ఖర్చుల కోసం క్యాబ్ డ్రైవర్లు, రెస్టారెంట్ వర్కర్లుగా మారుతున్న వైనం
ఖలిస్తాన్ పేరుతో కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత్ - కెనడా దౌత్యం తెగిపోయింది. దీంతో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఈ ప్రభావం మన దేశం నుంచి అక్కడకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులపై పడింది.

Due to the lack of jobs in Canada, Indians who have gone to study and work are making a living as cab drivers
కెనడా అనగానే ఒకప్పుడు తెగ పరుగులు తీసే వారు. వైద్య విద్య మొదలు అనేక పెద్ద చదువుల కోసం అక్కడికి వెళ్లేవారు. అయితే తాజాగా చలరేగిన మాటల యుద్దం కారణంగా ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఖలిస్తాన్ పేరుతో కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత్ – కెనడా దౌత్యం తెగిపోయింది. దీంతో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఈ ప్రభావం మన దేశం నుంచి అక్కడకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులపై పడింది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ తల్లిదండ్రులు.
కెనడాలో ఉద్యోగాల కొరత..
2022 లెక్కల ప్రకారం 2,26,450 మంది మన దేశం నుంచి చదువు కోసం కెనడాకు వెళ్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే తాజాగా అక్కడ నివసించే విద్యార్థి ఒకరు తన సామాజిక మాధ్యమాల వేదికగా ఇలా రాసుకొచ్చారు. ‘భారత్-కెనడాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిణామాల కంటే నా భవిష్యత్తు మీదే నాకు ఎక్కువ ఆందోళన కలుగుతోంది ‘ అని పోస్ట్ చేశారు. దీనికి చాలా మంది స్పందిస్తున్నారు. దీనికి కారణం ఉద్యోగాల కొరతగా చెబుతున్నారు అక్కడి భారతీయ విద్యార్థులు.
దుర్భర జీవనం గడుపుతున్న విద్యార్థులు..
ఇదిలా ఉంటే మరొకరు ఇంకో రకమైన భావనను వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న ఉద్యోగాల కొరత కారణంగా రానున్న రోజుల్లో నా విద్య పూర్తి అయితే ఉద్యోగం దొరుకుతుందో లేదో అన్న అనుమానాన్ని వ్యక్తపరిచారు. మన దేశం నుంచి వెళ్లిన పిల్లలు ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో దీనిని బట్టి అర్థమౌతోంది. పైగా వైద్య విద్య అభ్యసించిన వారికి సరైన ఉద్యోగావకాశాలు దొరకడం లేదు. పైగా ఇక్కడున్న భారతీయ విద్యార్థుల్లో చాలా మంది దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అంటూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు.
ఖర్చుల కోసం క్యాబ్ డ్రైవర్లుగా
టొరంటో నగరంలోని మరి కొందరు భారతీయ విద్యార్థులు అయితే చదివిన చదువుకు సరైన ఉద్యోగం లభించక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆ చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటే సరైన సంపాదన లభించడంలేదు. దీంతో వేరే గద్యంతరం లేక క్యాబ్ డ్రైవర్లుగా, రెస్టారెంట్ బాయ్స్ గా, సాధారణ షాపింగ్ మాల్స్ లో, చిన్న చిన్న దుకాణాల్లో పనిచేసుకుంటూ అవసరాలకు తగిన డబ్బులను సమకూర్చుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో తమ ఇంటి రెంట్లు, అవసరమైన వస్తువులు, కరెంట్ బిల్లులు కట్టుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. మరి కొందరైతే పెరిగిన ధరల నడుమ జీవనం గడపడం కష్టమని భావించి టొరంటో చుట్టుపక్కల ప్రాంతాల్లోని చిన్న చిన్న ఇరుకు అద్దెగదులను తీసుకొని కాలం గడుపుతున్నారు. ఇలా చేయడం వల్ల ఖర్చులు తగ్గి తినేందుకు సరిపడా వస్తువులు సమకూరుతాయని ఆలోచిస్తున్నారు.
ఈ పరిస్థితులు చూసైనా వారి నుంచి మనం కొన్ని పాఠాలను చేర్చుకోవాల్సి వస్తోంది. ఎక్కడికో ఉద్యోగాలు లేని దేశాలకు లక్షలు ఖర్చు చేసుకుని వెళ్లి ఇలా దారిద్ర్యంగా బ్రతికేకన్నా.. ఎలాంటి అప్పులు చేయకుండా ఇండియాలోనే ఉండి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నా అది బాగుంటుందని కొందరు విద్యార్థుల భావిస్తున్నారు.
T.V.SRIKAR