Puvvada Ajay Kumar: ఖమ్మం కార్పోరేషన్‌కు రూ.100 కోట్లు మంజూరు.. ఖమ్మం మీద ప్రేమా ? ఓడిపోతామన్న భయమా ?
బీఆర్ఎస్ కు ఖమ్మం మీద ఎనలేని ప్రేమ ఎన్నికల వేళ పుట్టుకొచ్చింది.
బీఆర్‌ఎస్ పార్టీని ఖమ్మం జిల్లా భయపేడుతోందా. రోజు రోజుకూ అక్కడి పరిణామాలు చూస్తుంటే బీఆర్‌ఎస్ నేతలో ఓటమి భయం పెరుగుతోందా. చూస్తే నిజమే అనిపిస్తోంది. ఓ పక్క తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి భారీ నష్టం జరిగింది. మరోపక్క బీఆర్‌ఎస్‌ను అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. టికెట్ రానివారంతా పక్క చూపులు చూస్తున్నారు. అమెరికా వెళ్లిన కేటీఆర్ ఇండియాకు రాగానే ముందు ఈ సమస్యలమీద ఫోకస్ చేయాలి. కానీ ఇవేవీ సమస్యలు కావన్నట్టు ఆయన అసందర్భంగా ఖమ్మం కార్పోరేషన్‌కు 100 కోట్లు నిధులు మంజూరు చేశారు.
మంత్రిగా పువ్వాడ అజయ్ ప్రమాణస్వీకారం చేసి 4ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిధులు మంజూరు చేశారని బీఆర్‌ఎస్ అంటోంది. కానీ ఖమ్మంలో ఓడిపోతామనే భయంతోనే నిధులు మంజూరు చేశారంటూ ప్రతిపక్షాలంటున్నాయి. ఇంతకాలం ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు గుర్తుకురాని అభివృద్ధి ఇప్పుడు మాత్రం ఎందుకు గుర్తుకు వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నాయి. ఖమ్మం జిల్లా మీద రోజు రోజుకూ బీఆర్‌ఎస్ పట్టు కోల్పోతోంది. ఆ జిల్లాలో కింగ్ మేకర్‌గా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు అనుచర వర్గాన్ని గెలిపించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల కూడా రేపోమాపో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. దీంతో ఖమ్మం చేజారిపోకుండా బీఆర్‌స్ జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే ఖమ్మం కార్పోరేషన్‌కు మంత్రి 100 కోట్లు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఈ నిధుల మంజూరునే ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది.