Pawan Kalyan: జనసేన కార్యకర్త చెంప చెల్లుమనిపించిన మహిళా సీఐ
జనసేన కార్యకర్తపై మహిళా సీఐ.. చేయి చేసుకున్న విజువల్స్.. ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయ్. శ్రీకాళహస్తిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ సర్కార్, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
దీంతో శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన శ్రేణులు ప్రయత్నించారు. జనసేన నాయకుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన సీఐ అంజూయాదవ్.. జనసేన నేత చెంపలు చెల్లుమనిపించారు. జనసేన కార్యకర్తను వెనుక నుంచి కానిస్టేబుల్ పట్టుకోగా.. సీఐ రెండు చేతులతో చెంప చెల్లుమనిపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐ అంజూయాదవ్ తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేశారు.
జనసేన నేతను సీఐ అంజూయాదవ్ కొట్టారని తెలియడంతో.. ఆ పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త పరిస్తితి చోటు చేసుకోకుండా ఉండేందుకు.. పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ గతంలోనూ అనేక వివాదాల్లో ఎదుర్కొన్నారు. సమయానికి హోటల్ మూయలేదంటూ గతంలో ఓ మహిళపై దాడి చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. టీడీపీ నేతల నిరసన కార్యక్రమంలోనూ ఓ కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. అంతేకాదు టీడీపీ మహిళా నేతను నిరసన కార్యక్రమంలో నుంచి లాక్కెళ్లిన సందర్భాలు లేకపోలేదు. ఇలా సీఐ వరుస వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు.