Micro Ganesh: తెలుగు రాష్ట్రాల్లో ఎకో ఫ్రెండ్లీ మైక్రో గణేశుల హవా..
పెద్ద పెద్ద విగ్రహాల ట్రెండ్ అంతమయ్యే రోజులు వచ్చేశాయా.. రేపటి తరం అంతా చిన్న గణపతులదేనా అంటే అవుననే సమాధానంతో పాటూ ఆచరణాత్మకంగా చేసి చూపిస్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళు.

Eco friendly micro Ganesha idols are made in Telugu states
నేటి వినాయక చవితిలో వ్రత కల్పం కంటే కూడా విగ్రహానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు మట్టితో చేసిన గణపయ్యను పూజిస్తే.. మరి కొందరు పీఓపీ తో తయారు చేసిన వాటిని ఆరాధిస్తున్నారు. వీటికి భిన్నంగా పెన్సిల్ లిడ్ పై గణపతిని చెక్కి అరుదైన ఘనత సాధించాడు ఒక యువకుడు.
వినాయక చవితి వచ్చిందంటే చాలు ఏ గల్లీలో ఎంత పెద్ద సైజులో గణపయ్య ఉన్నాడని ఆరాతీస్తుంటాం.. దీనికి విరుద్ధంగా మరీ ఇంత చిన్న సైజులో గణపయ్య ఉన్నాడా? అనే విధంగా ఈ బుజ్జి గణపయ్యను చూసి ఆశ్చర్య పోవాల్సిందే. అది కూడా పెన్సిల్ లిడ్ పై అత్యంత బుల్లి గణపయ్యను ఓ మైక్రో ఆర్టిస్ట్ తయారు చేశాడు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్టు మణిసాయి తన అద్భుత నైపుణ్యంతో బుల్లి గణపయ్యను తయారు చేశాడు. ఈ చిన్ని గణపయ్య సైజు ఎంత తెలుసా కేవలం 0.8 సెంటీమీటర్లు. గతంలో ఈయన ఒకే పెన్సిల్ లిడ్ పై 666 అక్షరాలతో కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ల పేర్లను చెక్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు ఏకంగా ఏషియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కి చరిత్ర సృష్టించాడు.
ఇదిలా ఉంటే మరొకరు చేతి గోరు పరిమాణంలో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి మండలంలో ఏటికొప్పక గ్రామం వినాయక చవితి సందర్భంగా లక్క బొమ్మలు తయారుచేసే చింతల లావణ్య ఒక అంగుళం ఎత్తు పరిమాణంలో ఒక వినాయకుడిని తయారు చేశారు. ఇందుకుగానూ రెండు రోజులు పట్టింది. పైగా పూర్తి ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని చెబుతున్నారు. ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీలో మగ వారి లాగానే మహిళలు కూడా ఈ బొమ్మల తయారీలో నైపుణ్యం సంపాదించాలనే ఉద్దేశంతో ఈమె 150 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.
దీనిని బట్టి అర్థమైంది ఏమిటంటే రానున్న రోజుల్లో విగ్రహాల సైజులు తగ్గి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పాలి. పైగా ఇవి పూర్తి పర్యావరణహితంగా ఉంటడంతో రానున్న రోజుల్లో వీటికి డిమాండ్ కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంది. పైగా మట్టిగణపతి నుంచి కలప, కాగితం ద్వారా చేసే వినాయకులపై అవగాహన పెరిగింది. రానున్న రోజులు ఎకో మైక్రో గణనాథులదే అని చెప్పాలి.
T.V.SRIKAR