Revanth Reddy on IT, ED Attacks : కాంగ్రెస్ పై కక్షతోనే ఈడీ, ఐటీ దాడులు : జనం ఆలోచించాలంటూ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగ లేఖను రిలీజ్ చేశారు.

ED and IT attacks on Congress itself: Revanth Reddy's open letter asking people to think
బీజేపీ – బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగ లేఖను రిలీజ్ చేశారు.
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఆ రెండు పార్టీల్లో చేరిన వాళ్ళే పవిత్రులు.. ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులు అన్నట్టుగా కక్షతో రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండొద్దు.. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులు మిగలకూడదు అన్నట్టుగా బీజేపీ – బీఆర్ఎస్ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ తో పనిచేస్తున్నాయి. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని కూడా వీళ్లు కుట్రలు, కక్షలతో వేధిస్తున్నారని మండిపడ్డారు రేవంత్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న టైమ్ కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి… వీటి వెనుక ఉన్నది ఎవరని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గడచిన పదేళ్లలో మోడీ – షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కు మన లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని రేవంత్ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ.. ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయి. అమిత్ షా – కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం… పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేస్తున్నారు. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే… వీళ్ల కుట్రలు మొదలవుతున్నాయి.
Telangana Elections : సీఎం కేసీఆర్ కు.. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండో బహిరంగ లేఖ
గత నెల రోజుల్లో ఏ బీఆర్ఎస్ నేత, ఏ బీజేపీ లీడర్ ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు రేవంత్. కేసీఆర్ కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లట్లేదు.. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ ను ప్రశ్నించవు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై.. తాజాగా వివేక్ వెంకటస్వామి ఇళ్లు, ఆఫీసులపైనే దాడులు చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామి ఇళ్ల పై, వ్యాపారాలపై ఎన్నికల సమయంలోనే దాడులు ఎందుకు చేస్తున్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు.. కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా. మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. మీ దుర్మార్గాలతో ప్రజలు విసిగిపోయారని రేవంత్ తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని అంటున్నారు రేవంత్ రెడ్డి.