Private School Fees: ప్రైవేటు విద్యాసంస్థల్లో భారీ ఫీజుల మోత.. ప్రభుత్వం ఏమీ చేయలేదా?
ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫీజుల్ని భారీగా పెంచేస్తుండటంతో తల్లిదండ్రులకు ఇది తలకు మించిన భారమవుతోంది. ఫీజుల్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోతోంది.
Private School Fees: కొత్త విద్యా సంవత్సరం మొదలవుతోందంటే చాలు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకటే ఆందోళన. ఈ సంవత్సరం ఎంత ఫీజు కట్టాల్సి వస్తుందేమో అని! ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం ఫీజుల్ని భారీగా పెంచుతుంటాయి. కొన్ని విద్యా సంస్థలైతే మరీ దారుణంగా 25-50 శాతం ఫీజుల్ని పెంచుతున్నాయి. దీంతో పిల్లల చదువు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతోంది. మరోవైపు ఫీజుల్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి.
భారమవుతున్న ఫీజులు
ప్రైవేటు స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు ఫీజుల పేరుతో చేస్తున్న దోపిడీకి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. తమ పిల్లల్ని మంచి స్కూళ్లలో చదివించాలనే తల్లిదండ్రుల లక్ష్యం వారిని ఇబ్బందులపాలయ్యేలా చేస్తోంది. కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే విపరీతంగా ఫీజుల్ని పెంచి తల్లిదండ్రులపై భారం పెంచుతున్నాయి. కొన్ని స్కూల్స్ 25-50 శాతం వరకు ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం (2023-24)కు సంబంధించి ఈ స్థాయిలో ఫీజులు పెంచేశాయి. మరికొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ కూడా 40-50 శాతం వరకు ఫీజులు పెంచాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యాలు తెలియజేశాయి. ఈ ఫీజుల గురించి తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు షాకవుతున్నారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెరిగిన ఫీజుల భారాన్ని ఎలా భరించాలి అని ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వ చర్యలేవి?
పెరుగుతున్న ఫీజుల్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. మూడేళ్లక్రితం కరోనా సమయంలో అంటే.. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో మాత్రం పాత ఫీజులే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో చాలా వరకు విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విధానాన్ని ఫాలో అయ్యాయి. పైగా ఆన్‌లైన్ క్లాసులు జరగడం వల్ల మెయింటెనెన్స్ భారం తగ్గడంతో, చాలా వరకు స్కూల్స్ పాత ఫీజుల్నే తీసుకున్నాయి. అయితే, ఆ తర్వాత నుంచి ప్రభుత్వ ఆదేశాలు లేవు. దీంతో విద్యా సంస్థలు మళ్లీ ఫీజులు పెంచుతున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలోనే భారీగా ఫీజులు పెంచిన యాజమాన్యాలు, ఈసారి మరింతగా ఫీజులు పెంచేందుకు రెడీ అవుతున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం ఫీజులకు సంబంధించి ఇప్పటికే తల్లిదండ్రులకు చాలా స్కూల్స్ వివరాలు అందించాయి. మిగతా స్కూల్స్ కూడా ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజుల విధానాన్ని ప్రకటించబోతున్నాయి. ఈ విషయంపై కొందరు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాల్ని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. తాము సిబ్బందికి ప్రతి సంవత్సరం వేతనాలు పెంచాలని, నిర్వహణ ఖర్చులు పెరిగాయని, అందువల్లే ఫీజులు పెంచుతున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే, పెరిగిన ఫీజులకు అనుగుణంగా సిబ్బందికి మాత్రం వేతనాలు పెంచడం లేదు. వారికి స్వల్పంగానే పెంచి, అధిక మొత్తంలో యాజమాన్యాలు లాభాలు పొందుతున్నాయి.
కమిటీ నివేదిక అమలు చేయని ప్రభుత్వం
ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ గురించి ప్రభుత్వానికి నిత్యం వినతులు వస్తూనే ఉన్నాయి. ఫీజుల్ని నియంత్రించాలని, అధిక ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తుంటాయి. ఇలాంటప్పుడు ప్రభుత్వాలు నామమాత్రంగా స్పందిస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి ఫీజుల నియంత్రణపై 2017 డిసెంబర్‌లో ఆచార్య తిరుపతి రావు కమిటీ ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అంది ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ కమిటీ సిఫారసులను ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఈ కమిటీ సిఫారసులను పరిశీలిస్తున్నామని మాత్రమే ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
మరోవైపు స్కూల్ ఫీజుల రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకురావాలని గత ఏడాది జనవరిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టం తయారు చేసేందుకు 11 మంది మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. తర్వాత ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీని ప్రకారం.. ప్రతి విద్యా సంవత్సరం పాత ఫీజులకంటే పది శాతం కంటే ఎక్కువ ఫీజులు పెంచకూడదని ప్రధానంగా సూచించింది. అలాగే విద్యా సంస్థల్ని నియంత్రించేలా ఇతర సూచనల్ని కూడా చేసింది. ఈ కమిటీ సూచనలు అమల్లోకి రావాలంటే దీనిపై సమగ్ర బిల్లును రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. అది ఆమోదం పొంది, అమల్లోకి రావాలి. కమిటీ నివేదిక వచ్చి ఏడాదవుతున్నా దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పట్లో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. అలాగని ఆర్డినెన్స్ జారీ చేసే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేయడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణా లేకపోవడంతో విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజుల్ని భారీగా పెంచుతూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి.