Narendra Modi: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం.. ఆర్డర్ ఆఫ్ నైల్ ఎందుకంత ప్రత్యేకం..
ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి.. అరుదైన గౌరవం దక్కింది. ఈజిప్ట్ దేశపు అత్యున్నత పురస్కారం.. ఆర్డర్ ఆఫ్ ది నైల్‌ను మోదీకి ప్రదానం చేశారు. ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్‌సిసి.. మోదీని ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డుతో స్వయంగా సత్కరించారు.
కైరోలో భారత్, ఈజిప్ట్ మధ్య ద్వైపాక్షిక సమావేశంలో భాగంగా మోదీ, అబ్దెల్ భేటీకి ముందు ఈ ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డును తనకు అందించినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈజిప్ట్‌లో అత్యుత్తమ పౌర పురస్కారం ఇది. మనదేశంలో భారతరత్నతో సమానం. స్వదేశంతో పాటు వివిధ రంగాల్లో సేవలను అందించిన వారికి.. ఈజిప్ట్ ఈ పురస్కారాన్ని అందిస్తోంది. జిమ్మీ కార్టర్, యూరీ గగారిన్, నెల్సన్ మండేలా, సుహార్తోలాంటి ప్రముఖులు ఈ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డును ఈజిప్టు భాషలో కిలాదత్ ఎల్ నిల్ అంటారు.
ఈ అవార్డును ఈజిప్టు సుల్తాన్.. హుస్సేన్ కమెల్ 1915లో స్థాపించారు. దేశానికి ఉపయోగకరమైన సేవ చేసిన వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తారు. మొదట్లో ఈ అవార్డును ఈజిప్టులో పనిచేస్తున్న బ్రిటిష్ అధికారులకు, విశిష్టమైన ఈజిప్షియన్ పౌరులకు ప్రదానం చేసేవారు. 1953లో ఈజిప్ట్ రిపబ్లిక్ అయిన తర్వాత.. ఆర్డర్ ఆఫ్ ది నైల్ అనేది ఈజిప్ట్ యొక్క అత్యున్నత పురస్కారంగా మారింది. ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డ్ 2 రకాలు.. మొదటిదాన్ని కాలర్ అంటారు.. దీన్ని రిపబ్లిక్ ప్రెసిడెంట్ ధరిస్తారు.
ఈ అవార్డును ఇతర దేశాధినేతలకు కూడా ఇవ్వొచ్చు. ఇక రెండో రకం ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డును గ్రాండ్ కార్డన్ అంటారు. ఇది ఈజిప్ట్ దేశానికి విశేష సేవలు అందించిన వారికి అందిస్తారు. పరాయి దేశంలో మోదీకి ఇలాంటి అవార్డు దక్కడం ప్రతీ భారతీయుడి గర్వకారణం అని బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయ్.