CBN ON PENSIONS : ఏపీలో కూటమికి షెన్షనర్ల దెబ్బ

ఏపీలో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వరుసగా రెండో నెల కూడా పింఛన్ దారులకు కష్టాలు తప్పలేదు. ఏప్రిల్ లో గ్రామ సచివాలయాల దగ్గర పడిగాపులు పడ్డ వృద్ధులు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 4, 2024 | 12:28 PMLast Updated on: May 04, 2024 | 12:28 PM

Elections Are Going To Be Held In Ap In A Week For The Second Month In A Row The Pensioners Are Facing Difficulties

ఏపీలో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వరుసగా రెండో నెల కూడా పింఛన్ దారులకు కష్టాలు తప్పలేదు. ఏప్రిల్ లో గ్రామ సచివాలయాల దగ్గర పడిగాపులు పడ్డ వృద్ధులు.. ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఎదురుచూడాల్సి వస్తోంది. వాలంటీర్లపై ఫిర్యాదు.. అటు తిరిగి.. ఇటు తిరిగి పెన్షనర్లకు కష్టాలు తెచ్చిపెట్టింది. పెన్షన్ సమస్యలతో.. విపక్షాలు డిఫెన్స్ లో పడ్డాయి. మొదట పింఛన్లు బ్యాంక్ ఖాతాలో వేయొచ్చు కదా అన్నాయి. ఇప్పుడు సచివాలయాల్లో ఇవ్వొచ్చుకదా అంటున్నాయి. మండుటెండల్లో కష్టపడుతున్న పింఛన్ దారులు… ఎన్నికల్లో టీడీపీ (TDP) పుట్టి ముంచబోతున్నారా ?

ఏపీలో పింఛన్ (AP Pension) దారుల కష్టాలు రెండో నెల కూడా కొనసాగుతున్నాయి. సచివాలయాల దగ్గర పడిగాపులు కాయటం కష్టంగా ఉంటే.. ఇప్పుడు బ్యాంకుల్లో క్యూతో మరిన్ని ఇబ్బందులు తప్పట్లేదు. వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఇంటికే పెన్షన్ ఇచ్చేవారు. సెలవు రోజైనా, ఆదివారమైనా… ఒకటి నాడు ఠంచనుగా వాలంటీర్లు డోర్ డెలివరీ చేసేవాళ్లు. ఈ వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయడం… పింఛన్ దారుల కొంపముంచింది. నడవలేని వయసులో వృద్ధులు మండుటెండలో బయటకు రావాల్సిన దుస్థితి. సచివాలయాల్లో మహా అయితే ఐదు రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేది. ఇప్పుడు బ్యాంకులు అంటే.. ఎన్ని రోజులు పడతాయో… ఎన్నాళ్లు ఎదురు చూడాలో అని పెన్షనర్లు మొత్తుకుంటున్నారు.

పింఛన్ల కోసం వచ్చి వృద్ధులు ప్రాణాలు వదులుతున్నారు వాళ్ళ ఉసురు మీకు తగులుతుందంటే.. మీకు తగులుతుందని పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈసీ ఉత్తర్వుల తర్వాతే గ్రామాల్లో వాలంటీర్లు లేకుండా పోయారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లతో నగదు పంపిణీ నిలిపేయాలని ఈసీకి లేఖ రాయడంతో.. ఆ ఆదేశాలు వచ్చాయి. వాళ్ళని దూరం పెట్టాలనుకునే ఆలోచన కాస్తా.. పెన్షన్ కష్టాలతో బూమరాంగ్ అయింది. ఈ గొడవతో తమకు సంబంధం లేదని విపక్షాలు చెబుతున్నా.. వైసీపీ మాత్రం టీడీపీయే కారణమని గట్టిగా ప్రచారం చేస్తోంది. జరగాల్సిన నష్టం జరగడంతో… వాలంటీర్లు లేకపోయినా… సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈసీ చెప్పినా… వైసీపీ కావాలనే పెన్షనర్లను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు… లక్షా అరవై వేల మంది సెక్రటేరియట్ సిబ్బంది ఉండగా… ఫించన్లు ఇంటింటికీ ఎందుకు ఇవ్వట్లేదని టీడీపీ నిలదీసింది. చేసిందంతా చేసి…ఇప్పుడు సర్కారును ఆడిపోసుకుంటారా అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

ఈసీకి టీడీపీ (TDP) నేరుగా ఫిర్యాదు ఇవ్వకున్నా..బాగా బద్నాం అయింది. ఊళ్లలో మీ చంద్రబాబు ఇలా చేశాడేంటని కొందరు వృద్ధులు డైరెక్ట్ గా టీడీపీ క్యాడర్ ను అడుతున్నారు. వారు నచ్చచెబుతున్నా వినిపించుకోవట్లేదు. పెన్షనర్ల మనసులో వైసీపీ నేతలు చంద్రబాబుపై వ్యతిరేకత కల్పించారనీ…ఇప్పుడు వాళ్ళ మనసు ఎలా మార్చాలని తలలు పట్టుకుంటున్నారు. మొన్నటిదాకా చంద్రబాబు వస్తే 4 వేలు పెన్షన్ ఇస్తాడని టీడీపీ ప్రచారం చేసింది. ఇప్పుడీ పెన్షన్ కష్టాలు చూశాక.. ఇప్పుడే ఇంత సినిమా చూపించారు. రేపేం చేస్తారని అడిగితే సమాధానం లేదు. పెన్షన్ల గోలలో ఎరక్కపోయి ఇరుక్కున్నామని టీడీపీ అంతర్మథనంలో ఉంది.

ఏపీలో చాలా సమస్యలున్నాయి. విభజన హామీలకు అతీగతీ లేదు. షెడ్యూల్ వచ్చేదాకా చాలా అంశాలపై మాట్లాడాయి విపక్షాలు. కానీ షెడ్యూల్ వచ్చాక అనూహ్యంగా పెన్షన్ల గోల మొదలైంది. ప్రతిపక్షాలు తేరుకునేలోపే.. వైసీపీ రాజకీయ వ్యూహం రచించి ఆచరణలో పెట్టేసింది. టీడీపీకి ఊహించని ఝలక్ ఇచ్చామని, తొలి దెబ్బ తామే తీశామని వైసీపీ (YCP) నేతలు చెప్పుకుంటున్నారు. ఏదో చేద్దామనుకుంటే.. మరేదో అవుతుందనే భయంతో కొందరు విపక్ష నేతలు నోరు ఎత్తడం లేదు. జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా ఊరుకున్నంత ఉత్తమం లేదంటున్నారు కొందరు నేతలు. పెన్షన్ గురించి వాదనకు దిగితే.. తమకే నష్టమని కూటమి భావిస్తోంది. అందుకే ఇటీవల అగ్రనేతలు కూడా పింఛన్ల పంపిణీ గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు.

రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు వేయాలి. సొంతంగానే కాదు… ప్రత్యర్థుల వ్యూహాలపైనా ఓ కన్నేసి ఉంచాలి. కానీ పెన్షన్ల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయింది. తనంతట తానుగా వైసీపీకి అవకాశం ఇచ్చేసింది. ఈ గోలతో తమకు సంబంధం లేదని గట్టిగా చెప్పుకోవడంలో విఫలమైంది. ఓటు బ్యాంక్ దృష్టితో చూసినా.. పెన్షనర్ల ఓటు గెలుపోటముల్ని తారుమారు చేస్తుందని టీడీపీ నేతలు ఆందోళన పడుతున్నారు. వాలంటీర్లతో వైసీపీకి బెనిఫిట్ అవుతుందనుకొని ఇచ్చిన ఫిర్యాదుతో వచ్చిన పింఛన్ కష్టాలు.. కూటమికి అంతకు మించిన నష్టం చేస్తాయనే అంచనాలున్నాయి. ప్రతిపక్షంలో ఉండే తిప్పలు తెచ్చారు.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చూసుకోండి అని వైసీపీ మరింతగా రెచ్చగొడుతోంది. దీంతో కూటమిలో గుబులు రేగుతోంది.