Elon Musk: ట్విట్టర్ పేరు, లోగో తొలగింపుపై మస్క్ వివరణ
ట్విట్టర్ పేరును, లోగోను మార్చడంపై ఎలాన్ మస్క్ వివరణ ఇచ్చారు. ట్విట్టర్ బ్లూ బర్డ్ స్థానంలో ఎక్స్‌ను తీసుకువచ్చారు. దీంతో ట్విట్టర్ పేరును కూడా ఎక్స్‌గా మార్చినట్లు అయింది.

Elon Musk, who changed the name of Twitter to X, responded recently
ట్విట్టర్ పేరు మార్పుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చకు ఎలాన్ మస్క్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేశారు. ట్విట్టర్‌ను ఇకపై సూపర్ యాప్ గా మార్చాలని భావిస్తున్నానని.. దానికోసమే పేరు, లోగో మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపార కమ్యూనికేషన్, ఆర్థిక ట్రాన్సాక్షన్స్ సహా విస్తృత ప్లాట్‌ఫామ్‌గా దీనిని మార్చాలి అనుకుంటున్నట్లు వివరించారు మస్క్. వాక్ స్వాతంత్రానికి గుర్తుగా ట్విట్టర్‌ను మార్చాలని ఎక్స్ కార్పోరేషన్ దీనిని కొనుగోలు చేసిందని.. అందులో భాగంగానే ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చామని తెలిపారు.
కేవలం పేరు మార్చుకోవడం కాదని.. ఇకపై ట్విట్టర్ లేదా ఎక్స్ అదే పని చేస్తుందని ధీమగా చెప్పారు. ట్వీట్‌కు 140 అక్షరాల పరిమితి ఉన్నప్పుడు ట్విట్టర్ అనే పేరు సరిపోతుందని.. ఐతే ఇప్పుడు ఆ పేరు ఉండటంలో అర్థం లేదన్నారు మస్క్. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా పెద్ద సైజ్ వీడియోలు కూడా షేర్ చేయొచ్చని వివరించారు. మరికొన్ని నెలల్లో ట్విట్టర్ అలియాస్ ఎక్స్ యాప్‌లో కీలక మార్పులు రానున్నట్లు చెప్పారు.
ఇకపై యూజర్లు తమ ఆర్థిక లావాదేవీల కోసం.. ఇతర యాప్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదని, ఈ ఫ్లాట్‌ఫామ్‌ను అన్నింటికి అనుకూలంగా మార్చనున్నట్లు మస్క్ చెప్పారు. ఇప్పటికే వీడియోకు సంబంధించి కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు మస్క్.