Elon Musk: ఇండియాలో టెస్లా ఫస్ట్ స్టెప్ కేరాఫ్ పుణే
ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఇండియాలోకి అనఫిషియల్ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ప్రభుత్వంతో ప్లాంట్ ఏర్పాటుపై ఇంకా చర్చలు జరుగుతుండగానే మరోవైపు భారత్‌లో కార్పొరేట్ ఆఫీసు ఏర్పాటైపోతోంది.
పుణెలో ఆఫీస్ ప్రాంగణాన్ని లీజ్‌కు తీసుకుంది టెస్లా.. కంపెనీ దూకుడు చూస్తుంటే త్వరలోనే అఫిషియల్ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ..?
ఎలక్ట్రిక్ కార్ల తయారీ జెయింట్ టెస్లా భారత్‌లో మెగా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సాగుతున్నాయి. అవి తుదిదశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఎంట్రీ కేవలం లాంఛనమే కావడంతో టెస్లా తదుపరి కార్యాచరణను సిద్ధం చేసింది. కార్పొరేట్ ఆఫీసు ఏర్పాటుకు స్థలాన్ని ఎంచుకుంది. పుణెలోని విమన్ నగర్ ప్రాంతంలో స్పేస్‌ను లీజుకు తీసుకుంది. పంచశీల్ బిజనెస్ పార్క్‌లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో 5,850 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా భారతీయ విభాగం టెస్లా ఇండియా మోటర్ అండ్ ఎనర్జీ ఎంచుకుంది. ఈ అక్టోబర్‌తో మొదలై ఐదేళ్ల పాటు ఈ లీజు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత మరికొన్నేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. ఆ స్థలానికి నెలకు రూ.11.65లక్షల అద్దె చెల్లించనుంది. ఏటా 5శాతం మేర పెంచేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. మొత్తం ఐదేళ్ల కాలంలో రూ.7.72కోట్లు అద్దెగా చెల్లిస్తుంది టెస్లా.
ఆపిల్ మోడల్ ఫాలో అవుతుందా..?
టెస్లా దేశంలో భారీ ఎలక్ట్రిక్ వెహికిల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి విధివిధానాలు, రాయితీలపై ప్రభుత్వంతో చర్చలు తుదిదశకు చేరాయి. ఇక్కడ తయారైన కార్లను ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఎగుమతి చేయాలని టెస్లా ప్లాన్ చేస్తోంది. నిజానికి ఎప్పుడో టెస్లా ప్లాంట్ ఇండియాలో ఏర్పాటు కావాల్సి ఉంది. 2021లో టెస్లా ఇండియా కూడా ఏర్పాటైంది. అయితే ప్రభుత్వం ఇస్తామన్న రాయితీలపై మస్క్ సంతృప్తి చెందలేదు. దీంతో పీటముడి పడిపోయింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో మోడీతో మస్క్ భేటీ అయ్యారు. ఆ తర్వాత టెస్లా ప్లాంట్ ఏర్పాటుపై కదలిక వచ్చింది. ప్లాంట్ ఏర్పాటుతో పాటు తన సప్లయ్ చెయిన్‌ను అవసరమైతే చైనా నుంచి ఇండియాకు మార్చాలని కూడా టెస్లా ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇంకా రావాల్సి ఉంది. చైనాతో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఆపిల్ కూడా చైనా సప్లయర్స్ భారత్ కంపెనీలతో జట్టుకట్టి మన దేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చేసింది. టెస్లా కూడా అదే మోడల్ ఫాలో కావాలని కేంద్రం సూచిస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే టెస్లా కార్లు త్వరలోనే భారతీయ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. రూ.20లక్షల బడ్జెట్‌లో కార్లను తీసుకువచ్చి దేశీయ మార్కెట్‌ను కొల్లగొట్టాలని టెస్లా ఆలోచిస్తోంది. టెస్లా ఎంట్రీ దాదాపు ఖరారు కావడంతో దేశీయ కంపెనీలు దాన్ని ఎదుర్కొనేందుకు కసరత్తు చేస్తున్నాయి.