Jammu Kashmir: గాజాలో ఉద్రిక్తతల ప్రభావం జమ్మూకశ్మీర్‌పై చూపుతుందని ఉన్నతాధికారుల ముందస్తు భేటీ

గాజా ఉద్రిక్తల ప్రభావం భారత్ లోని జమ్మూ కాశ్మీర్ పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. ఈ యుద్దం ప్రభావంతో తీవ్ర నిరసనలకు దారితీసే పరిస్థితులు తలెత్తవచ్చని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2023 | 09:23 AMLast Updated on: Oct 26, 2023 | 9:23 AM

Emergency Meeting Of Top Officials In Jammu And Kashmir Amid Tense Situation In Gaza

గత 20 రోజులుగా హమాస్ ఇజ్రాయెల్ యుద్దం భీకరంగా సాగుతోంది. దీని ప్రభావంతో గాజా కేంద్రంగా దాడులు అధికంగా జరుగుతున్నాయి. వేల మంది సైనికులు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీని కారణంగా గాజా స్ట్రిప్ లో సంక్షోభం ఏర్పడింది. ఈ ప్రభావం భారత్ లోని జమ్మూ కాశ్మీర్ పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. ఈ యుద్దం ప్రభావంతో తీవ్ర నిరసనలకు దారితీసే పరిస్థితులు తలెత్తవచ్చని తెలుస్తోంది. అందుకే శ్రీనగర్ లోని 15 కార్ఫ్స్ ప్రధాన కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల ప్రతినిధులు ప్రత్యేకంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

సెక్యూరిటీ కల్పనపై తీవ్రంగా చర్చలు జరిగినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఉగ్రమూకలు నిరసనలు తెలిపితే వాటిని ఖండించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉగ్రమూకలు ఏవైనా ఘాతుకానికి పాల్పడితే వాటిని ఎలా నిరోధించాలనే అంశంపై చర్చించినట్లు మీడియాకు తెలియజేశారు. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు.

గత ఏడాది జమ్మూ కాశ్మీర్ లో సుమారు 46 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అందులో 37 మంది పాకిస్తానీలే అని తెలిసింది. జమ్మూ కాశ్మీర్ లోని 33 ఏళ్ల ఉగ్రవాద చరిత్రలో స్థానికంగా ఉండే ఉగ్రవాదుల కంటే విదేశీ ఉగ్రవాదులే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో 130 మంది ఉగ్రవాదులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు, ఆర్మీ కమాండర్, రాష్ట్ర పరిపాలన, భద్రతా సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

T.V.SRIKAR