Eetela Rajender: బీజేపీలో సైలెంట్ అయిపోయిన ఈటల.. అనుకున్నదే జరగబోతుందా ?
తెలంగాణ రాజకీయం అంటే.. కర్ణాటక ఎన్నికలకు ముందు, కర్ణాటకల ఎన్నికలకు తర్వాత అన్నట్లుగా తయారయ్యాయ్. కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధం జరిగేది. ఐటీ దాడులు, కవిత ఎపిసోడ్, ఈడీ సోదాలు.. అబ్బో రాజకీయం మంటలు పుట్టించేది. కట్ చేస్తే.. కర్ణాటక ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది.
బీజేపీ సైడ్ అయిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు యుద్ధం కనిపిస్తోంది. కసి మీద కనిపించిన కమలం పార్టీ.. ఒక్కసారిగా కూల్ అయింది. నిజానికి మొన్నటివరకు తెలంగాణలో బీజేపీ రాజకీయమే వేరు ! వీళ్ల దూకుడుకు హద్దే లేదా, ఉండదా అనే స్థాయిలో బీజేపీ నేతలు రెచ్చిపోయేవారు. ఘాటు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సర్కార్ మీద, కేసీఆర్ మీద విరుచుకుపడేవారు.
జనాల సమస్యలపై వెంటనే రియాక్ట్ అయ్యేవారు. తగ్గేదే లే అన్నట్లు ప్రతీ విషయంలో జోష్ మీద కనిపించేవారు. కర్ణాటక ఫలితాల తర్వాత నుంచి ఎప్పుడయితే కాంగ్రెస్ రేసులోకి వచ్చిందో.. బీజేపీ వెనక్కి తగ్గింది. కమలం పార్టీలోకి వలసలు ఆగిపోయాయ్ పూర్తిగా ! పార్టీ కార్యక్రమాలు కూడా సోసోగానే సాగుతున్నాయ్. బండి మినహా.. ఏ నాయకుడు కూడా ఫైర్ అవుతున్నట్లు కనిపించడం లేదీ మధ్య. నిన్న మొన్నటివరకు పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ.. చేరికలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ.. ఓ వైపు కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూనే.. మరోవైపు ఇతర పార్టీల నేతలని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిన ఈటల.. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు కనిపించడం లేదు. పార్టీ గురించి జోష్‌గా మాట్లాడినట్లు కూడా వినిపించడం లేదు. పొంగులేటి ఎపిసోడ్ తర్వాత ఈటల మౌనముని అయిపోయారు. పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించాలని ఈయన వెళ్తే.. బీజేపీలో ఉండడం ఎందుకు మీరు వచ్చేయండి కాంగ్రెస్‌కు అని ఈటలకే రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు పొంగులేటి. బీజేపీలో ఈటలకు సరైన గౌరవం దక్కడం లేదనే చర్చ జరుగుతున్న వేళ.. ఆయన కమలానికి హ్యాండ్ ఇచ్చి హస్తం పార్టీ వైపు మొగ్గుచూపుతారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. తెలంగాణ బీజేపీలో బండి వర్గం, ఈటల వర్గం అని రెండు గ్రూప్‌లు మొదలయ్యాయ్. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. ఈ మధ్యే ఢిల్లీకి వెళ్లొచ్చిన ఈటలలో.. ఎలాంటి ఉత్సాహం కనిపించలేదు కదా.. మరింత సైలెంట్ అయ్యారు. అంటే అనుకున్నదే జరగబోతోందా.. చేరికల కమిటీ చైర్మన్ ఇంకో పార్టీలో చేరబోతున్నారా అనే గుసగుసలు మొదలయ్యాయ్.