Eetela Rajender: ఈటలతో పొంగులేటి, జూపల్లి భేటీలో ఏం జరిగింది.. ఇద్దరు నేతలు బీజేపీలో చేరడం ఖాయమా ?
కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న సంగతి పక్కనపెడితే.. చేరికల మీద మాత్రం కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందనే చర్చ మొదటి నుంచి వినిపించింది. దీనికి తగినట్లు పొంగులేటి, జూపల్లి కూడా ఛలో కాంగ్రెస్ అని జెండా ఎత్తేందుకు రెడీ అయ్యారనే చర్చ కూడా జరిగింది.

Jupalli and Ponguleti Meet with Eetela
ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో చేరితే.. హస్తం పార్టీ బలం డబుల్ అవడం ఖాయం. కట్ చేస్తే సీన్ మొత్తం మారిపోయింది. ఇద్దరు నేతలకు చేయి అందించడంలో.. కాంగ్రెస్ ఫెయిల్ అయితే.. బీజేపీ సక్సెస్ అయిందా అంటే అవును అనే చర్చ జరుగుతోంది. ఈటలతో రహస్య భేటీలో.. బీజేపీలో ఇద్దరు నేతల చేరికపై దాదాపు క్లారిటీ వచ్చేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది తెలంగాణ రాజకీయవర్గాల్లో !
పొంగులేటి, జూపల్లి ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ యూజ్ చేసుకోలేకపోయింది. చేరేందుకు సిద్ధమని దాదాపుగా హింట్లు ఇచ్చేశారు ఇద్దరు నేతలు. ఐతే అనూహ్యంగా పొంగులేటి, జూపల్లి కృష్ణరావులతో బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ భేటీ కావడంతో సీన్ రివర్స్ అయింది. దాదాపు నాలుగు గంటలు.. ఆ ఇద్దరి నేతలతో ఈటల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు గంటల చర్చల తర్వాత.. బీజేపీలో చేరేందుకు పొంగులేటి, జూపల్లి సిద్ధం అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఈ మీటింగ్‌లో పొంగులేటి, జూపల్లి కృష్ణరావుకు.. బీజేపీ అదిరిపోయే ఆఫర్లు ఇచ్చిందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇద్దరు నేతలను కమలం పార్టీ వైపు తిప్పుకోవడంలో.. ఈటల తన అనుభవం, చతురత ఉపయోగించారని తెలుస్తోంది. మంచి ముహూర్తం చూసుకొని.. ఇద్దరు నేతలు.. కాషాయ కండువా కప్పుకోవడం ఖాయం అనే ప్రచారం సాగుతోంది. ఇద్దరి నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు హస్తం నేతలు కూడా గట్టిగానే ప్రయత్నించారు. ఐతే నేతలను ఆకర్షించడం బీజేపీకి తెలిసినంతగా.. కాంగ్రెస్‌కు తెలియదు. దీంతో కమలం పార్టీ పైచేయి సాధించింది.
ఇదే నిజం అయితే.. కమలం పార్టీ బలం భారీగా పెరగడం ఖాయం. పేరుకు ఇద్దరే అయినా.. నాలుగైదు జిల్లాల్లో ఫలితాలను డిసైడ్ చేయగల సత్తా ఉంది. ఇద్దరు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారనే ప్రచారం జరుగుతున్న వేళ.. కమలం పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక అన్నీ మంచి శకునములే అని.. తెగ మురిసిపోతున్నారు బీజేపీ కార్యకర్తలు, నాయకులు.