రియాలిటీ షో బిగ్ బాస్ కు ఫాలోయింగ్ ఓ రేంజ్ లోనే ఉంటుంది. పలు భాషల్లో క్రమంగా దీనిని విస్తరిస్తున్న వేళ తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకుంది. అయితే గత రెండు సీజన్లలో కంటెస్టెంట్ల విషయంలో నిర్వాహకులు సరైన వ్యూహంతో వ్యవహరించకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేదన్న విమర్శ ఉంది. దీంతో ఈ సారి అన్ని రంగాల సెలబ్రిటీలను షోలో ఎంట్రీ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓ మాజీ క్రికెటర్ బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా వస్తాడని ప్రచారం జరుగుతోంది. ఆ క్రికెటర్ ఎవరో కాదు తెలుగుతేజం అంబటి రాయుడు. ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చిన రాయుడు వైసీపీలో చేరి కొన్నాళ్ళకే జనసేనకు మారాడు. ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న రాయుడు పలు విదేశీ లీగ్స్ లోనూ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాయుడుని బిగ్ బాస్ షోలోకి తీసుకొస్తే ప్రోగ్రామ్ కు క్రేజ్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న రాయుడు బిగ్ బాస్ లోకి వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే విదేశీ లీగ్స్ , కామెంట్రీ వంటి వాటితో బాగానే ఆర్జిస్తున్న రాయుడు 100 రోజుల పాటు బిగ్ బాస్ షోలో గడపడం కష్టమే అని భావిస్తున్నారు.