బంగ్లాతో జర జాగ్రత్త టీమిండియాకు మాజీల వార్నింగ్
క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం... అంచనాలు లేని జట్టు సంచలన విజయం సాధించొచ్చు... ఫేవరెట్ అనుకున్న టీమ్ బోల్తా పడొచ్చు...అందుకే ఏ జట్టును తక్కువ అంచనా వేయొద్దని చాలామంది చెబుతుంటారు. ఇప్పుడు భారత్ కు కూడా ఇలాంటి వార్నింగ్ ఇస్తున్నారు.
క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం… అంచనాలు లేని జట్టు సంచలన విజయం సాధించొచ్చు… ఫేవరెట్ అనుకున్న టీమ్ బోల్తా పడొచ్చు…అందుకే ఏ జట్టును తక్కువ అంచనా వేయొద్దని చాలామంది చెబుతుంటారు. ఇప్పుడు భారత్ కు కూడా ఇలాంటి వార్నింగ్ ఇస్తున్నారు. బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. టీమిండియాతో పోలిస్తే బంగ్లాదేశ్ చిన్నదే అయినా ప్రస్తుతం పాక్ టూర్ లో అదరగొడుతోంది. తొలి టెస్టులో పాకిస్తాన్ కు షాకిచ్చి ఇప్పుడు రెండో మ్యాచ్ లోనూ విజయం దిశగా సాగుతోంది. అలాంటి టీమ్ ను తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే.
వరల్డ్ క్రికెట్ లో బంగ్లాదేశ్ సంచలనాలు సృష్టించిన సందర్భాలను ఫ్యాన్స్ మరిచిపోరు. వారిపై అంచనాలు ఉండవు కాబట్టి స్వేఛ్ఛగా ఆడే అవకాశం బంగ్లాకు కలిసొచ్చే అంశం. అదే సమయంలో అంచనాలకు తగ్గట్టు రాణించాల్సిందే అన్న ఒత్తిడి టీమిండియాకు మైనస్ పాయింట్. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ పూర్తి సీనియర్లతోనే బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఒత్తిడి కొత్త కాదు. అయితే భారత్ కు గట్టిపోటీనిచ్చే బంగ్లాదేశ్ విషయంలో అప్రమత్తంగా లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో తలపడనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ పై సిరీస్ విజయం రోహిత్ సేనకు కాన్ఫిడెన్స్ పెంచుతుందని చెప్పొచ్చు.