Narendra Modi: మోడీ భజన మీడియా ఈ దృశ్యాలను ఎందుకు చూపించదు ? ఇవి అబద్ధం చెబుతాయా ?

మోడీ..మోడీ..మోడీ.. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీ వరకు కొన్ని రోజులుగా హైపిచ్‌లో వినిపిస్తున్న స్లోగన్ ఇది. ప్రధానమంత్రి మోదీ అమెరికాలో అడుగుపెట్టకముందే.. ఆయన అమెరికా పర్యటనను ఓరేంజ్‌లో ప్రమోట్ చేసే పనులు మొదలయ్యాయి. కొన్ని వారాలుగా జాతీయ మీడియా మొత్తం ఇదే పనిలో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 23, 2023 | 05:41 PMLast Updated on: Jun 23, 2023 | 5:41 PM

Faced With Modi In America Why His Pro Media Did Not Show The Opposite Campaign

అమెరికా మొత్తం మోడీ మానియాలో ఊగిపోతున్నట్టు.. తన జీవితంలో మోడీకి ఆతిథ్యం ఇవ్వడం కంటే గొప్ప కార్యం మరొకటి లేదని జో బైడెన్ ఫీల్ అవుతున్నట్టు.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు కథనాలు వండి వార్చేశారు. మోదీ అమెరికాలో ల్యాండ్ అయింది మొదలు.. శ్వేతసౌధంలో ఆతిథ్యం తీసుకునే వరకు ఎక్కడా చూసినా.. మోదీ అనుకూల నినాదాలే. మంచిదే..అగ్రరాజ్యాలకు తీసిపోని విధంగా ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతున్న సందర్భంలో సాక్ష్యాత్తూ అమెరికా అధ్యక్షుడే స్వయంగా స్టేట్‌విజిట్‌కు ఇండియన్ ప్రైమినిస్టర్‌ను ఆహ్వానించినప్పుడు ఈ మాత్రం హంగామా , హడావుడి కచ్చితంగా ఉంటుంది. అమెరికాలోనే కాదు.. మోదీ ఆస్ట్రేలియా వెళ్లినా.. మరో దేశం వెళ్లినా.. ఆయనకు ఎదురెళ్లి.. స్వాగతం పలికి.. మోదీ మోదీ అంటూ నినదించే అభిమాన వర్గం ఎప్పుడూ ఉంటుంది. అయితే మోదీ అమెరికా పర్యటనలో మొత్తం ఇలాంటి వాతావరణమే ఉందా..? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపిస్తున్నట్టు మోదీ మానియాతో యావత్ అమెరికా ఊగిపోతుందా..? అవునో కాదో.. ఈ క్రింద ఉన్న ఫోటోలను చూస్తే మీకే అర్థమవుతుంది.

ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి ?

ప్రధానమంత్రి మోదీ అమెరికాలో వివిధ అధికార కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న సమయంలో న్యూయార్క్ వీధుల్లో తిరుగుతున్న ట్రక్స్ అక్కడ ప్రజలను ఆలోచింపచేశాయి. ట్రక్‌కు అన్ని వైపులా ఏర్పాటు చేసిన డిజిటల్ బ్యానర్లు కొన్ని ప్రశ్నలను సంధించాయి. మోదీ హయాంలో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలపై దాడులు జరిగిన విషయం మీకు తెలుసా ? విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌ను ఎలాంటి విచారణ లేకుండా 1000 రోజుల పాటు జైల్లో ఎందుకు ఉంచారో మోదీ గారిని అడుగుతారా బైడెన్ ? మణిపూర్‌ ఘర్షణలపై ఎందుకు మాట్లాడరు ? వెల్‌కమ్ మోడీజీ.. క్రైమ్‌మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటూ బ్యానర్లను ప్రదర్శించారు. మోదీ పాలనలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని.. వాటిపై ప్రధానమంత్రి మౌనం వీడటం లేదని ఆరోపిస్తూ కొన్ని ప్రజా సంఘాలు న్యూయార్క్ లో నిరసనకు దిగారు. వీరిలో మోదీకి ఆతిథ్యం ఇస్తున్న అధికార డెమొక్రటిక్ పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారు.

Nagetive Publicity To Modi In America

భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందా ?

ప్రధానమంత్రి మోదీ అమెరికాలో అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. ఆయన సహజశైలికి భిన్నంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సాధారణంగా మోదీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహించరు..మన్ కీ బాత్ ద్వారా ఆయన చెప్పాలనుకుంటున్నది యావత్ ప్రపంచం వినాల్సిందే తప్ప ఆయన ఎవరి ప్రశ్నలకు సమాధానం చెప్పరు. 9 ఏళ్ల పాలనలో ప్రధానమంత్రిగా ఆయన ఎప్పుడూ మీడియో ఇంట్రాక్ట్ కాని మోదీ.. అమెరికా పర్యటనలో బైడెన్ సమక్షంలో రిపోర్టర్ల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అది కూడా ప్రజాస్వామ్యం గురించి. భారత్‌లో మైనార్టీ హక్కుల పరిరక్షణ గురించి యూఎస్ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి మోదీ సమాధానం కూడా ఇచ్చారు. ప్రజాస్వామ్యం భారత్, అమెరికా డీఎన్‌ఏలోనే ఉందని.. కుల,మత ప్రాంతాల ఆధారంగా విపక్ష చూపే అవకాశమే ఉండదన్నారు.

భారత్‌లో మోడీ చెప్పినట్టే జరుగుతుందా ?

శ్వేతసౌధం వేదికగా ప్రధానమంత్రి మోడీ ప్రజాస్వామ్యం గురించి చాలానే చెప్పారు. మరి నిజంగా భారత్‌లో ఆయన చెప్పిన ప్రజాస్వామ్యం అమలువుతుందా ? మనదేశంలో కులం, మతం వివక్ష అన్నదే లేదా ? ప్రజాస్వామ్యం అంటే ప్రజలే దేవుళ్లు కదా..? ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల బాగోగులు చూడాలి కదా..! మరి అలా జరుగుతుందా ? దేశంలో మైనార్టీ వర్గాలపై మెజార్టీ వర్గాల దాడులు నిజం కాదా ? ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కేయడం లేదా ? ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే… ఉపా వంటి దేశద్రోహం కేసులతో జైల్లో పెట్టడం ఇవన్నీ ప్రజాస్వామ్యం కిందకే వస్తాయా ? ప్రజాస్వామ్యం డీఎన్‌ఏలోనే ఉంటే.. దేశానికి పతకాలు తెచ్చిన రెజ్లర్లు వీధిపోరాటాలు ఎందుకు చేయాల్సి వచ్చింది ? బీజేపీ ఎంపీపై లైంగిక దాడి ఆరోపణలు చేస్తే..ఆయనపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేయడమే ప్రజాస్వామ్యమా..? ఇవన్నీ ఎందుకు… మణిపూర్‌‌లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం కదా..! రెండు జాతుల మధ్య ఘర్షణ రాష్ట్రంలో నిప్పు పెడితే.. కనీసం ఒక్కసారైనా.. నాలుగు మంచి మాటలు చెప్పి ఆ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారా ?

Nagetive Publicity To Modi In America

వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం కాదా ?

తమకు అన్యాయం జరుగుతుందని మోదీకి వ్యతిరేకంగా భారతీయులు గొంతెత్తితే అర్థం చేసుకోవచ్చు..కానీ అనేక మంది అమెరికన్లు కూడా మోడీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు.. మిమ్మల్ని మా దేశంలోకి ఆహ్వానించబోం అంటూ బ్యానర్లు కట్టుకుని తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా… జో బైడెన్ దీనిపై స్పందించలేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎలక్షన్ మూడ్‌లో ఉన్నారు. మోదీకి వ్యతిరేకంగా వినిపించే మాటలను.. ప్రదర్శించే ప్లకార్డులను ఆయన పట్టించుకోరు. ఆయన వాటికి విలువిస్తే… అమెరికా రాజకీయాల్లో కీలకంగా మారిన ఇండో అమెరికన్ల ఓట్లు చేజారిపోతాయ్. అందుకే మోదీతో చిరునవ్వులు చిందిస్తూ…ఆయనకు శ్వేతసౌధం మొత్తం చూపించి విందుభోజనం పెట్టారు జో బైడెన్. అమెరికాలో 50 లక్షలకు పైగా ఉన్న భారత సంతతి ప్రజలు.. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు మద్దతివ్వాలంటే.. ఆయన భారత ప్రధానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకూడదు. అందుకే మోదీకి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు, ప్రదర్శనలు మీడియాలో ఎక్కువగా కనిపించవు. వినిపించవు. మోదీ చెప్పినట్టు ఇదే కదా ప్రజాస్వామ్యమంటే.. అవును మరి. అలాగే అనుకుందాం..!