IPS: ఐపీఎస్‌లకే నిద్ర లేకుండా చేసిన.. నకిలీ ఐపీఎస్

వీడు నకిలీలకే నకిలీ. ఏకంగా ఐపీఎస్‌నంటూ అందరిని నమ్మించాడు. చెప్పిన అబద్దం.. చేసిన పాపం ఎక్కువ రోజులు నిలవదు కదా.. ఇతని విషయంలో అదే జరిగింది. ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇతని పేరు నాగరాజు అలియాస్ రామ్ ఐపీఎస్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2023 | 01:45 PMLast Updated on: May 25, 2023 | 1:45 PM

Fake Ips Officer Did A Crime

పోలీసునని చెప్పుకోవడమే కాదు.. యూనిఫామ్ వేసుకొని సెటిల్‌మెంట్స్‌, విచారణలు, ఎన్‌కౌంటర్‌లు.. ప్రతీదాంట్లో జోక్యం చేసుకున్నాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్ అని ప్రచారం చేసుకున్నాడు.సెక్స్ వర్కర్లని, చోటామోటా దొంగలను తీసుకెళ్లి విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టాడు. ఆర్మీ మాజీ చీఫ్ బిపిన్ రావత్‌తో కలసి ఆర్మీలో మేజర్‌గా పనిచేసినట్టు ఓ ఫొటో క్రియేట్ చేశాడు. ధోనితో తీసుకున్న ఫోటోలతో ప్రచారం చేసుకున్నాడు. రామ్‌ అరాచకాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. చాన్నాళ్లుగా అతనిపై కన్నేసిన సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు.

తీగలాగితే.. ఈ నకిలీగాడి బాగోతాలన్నీ బయటకు వచ్చాయ్. రామ్‌, నాగరాజు, రాజు.. ఇలా రకరకాల పేర్లతో ఈ బురిడీగాడు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. మూడేళ్ల కిందే సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇక్కడ పప్పులు ఉడకడం లేదని పక్క రాష్ట్రాలకు మకా మార్చాడు రామ్. వైర్‌లెస్‌ సెట్‌, బేడీలు. ఇలా ఐపీఎస్‌ను అని నమ్మించేందుకు రామ్ తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. ఏపీకి చెందిన నాగరాజ్ అలియాస్ రామ్.. చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని కలలు కన్నాడు. ప్రయత్నాలు చేశాడు కానీ సక్సెస్‌ కాలేకపోయాడు. తనను తాను పోలీస్‌గా చూసుకోవాలనుకొని.. నకిలీ అవతారం ఎత్తాడు.

హైదరాబాద్‌లో తక్కువ ధరకే జాగ్వర్ కార్ ఇప్పిస్తామని చెప్పి.. జార్ఖండ్‌లో ఓ మహిళను ట్రాప్ చేశాడు. 15 లక్షలు తీసుకొని ఉడాయించాడు. మహిళ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించగా.. నకిలీగాడి అసలు బాగోతం బయటపడింది. ఇదొక్కటే కాదు.. రామ్ మీద చాలా కేసులు ఉన్నాయ్. పోలీసు ముసుగులో ఓ పారిశ్రామికవేత్తను కిడ్నాప్ చేసి.. 14 కోట్లు కొల్లగొట్టాడు గతంలో. రామ్ సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. గతంలో బైక్ దొంగతనం కేసులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డుగా పనిచేశాడు.

యూనిఫామ్ సర్వీసెస్ అంటే రామ్‌కు పిచ్చి. పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోయేసరికి సెక్యూరిటీ ఏజెన్సీలో చేరాడు.అక్కడ రిటైర్డ్ ఆర్మీ అధికారితో పరిచయం ఏర్పడింది. ఆయన సహకారంతో ఆర్మీలో హోదాలు, ఇతర విషయాలపై పట్టు పెంచుకున్నాడు. పుట్టి పెరిగిందంతా పశ్చిమ గోదావరి జిల్లానే అయినా నార్త్‌ ఇండియన్‌లా హిందీ మాట్లాడగలడు. చీటింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతని లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. టెక్నాలజీపై బాగా పట్టు సాధించాడు. నకిలీ ఐడీ కార్డులు తయారు చేయడంలో దిట్ట. 14 జీమెయిల్ అకౌంట్స్‌ ఉన్నాయి. రామ్ బాగోతాలు చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. అతని నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు 23 వస్తువులు సీజ్ చేశారు.