ఇది ఐపీఎల్ కాదు.. టెస్ట్ క్రికెట్ గంభీర్ ను ఆడుకుంటున్న ఫ్యాన్స్

సొంతగడ్డపై భారత జట్టు తొలిసారి అవమానకర ఓటమిని ఎదుర్కొంది. 12 ఏళ్ళ జైత్రయాత్రకు బ్రేక్ వేస్తూ న్యూజిలాండ్ రోహిత్ సేనకు షాకిచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా... కనీసం పోటీ ఇస్తే చాలన్న రీతిలో కివీస్ పై చాలా మంది మాట్లాడారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 27, 2024 | 03:23 PMLast Updated on: Oct 27, 2024 | 3:23 PM

Fans Fire On Gambhir

సొంతగడ్డపై భారత జట్టు తొలిసారి అవమానకర ఓటమిని ఎదుర్కొంది. 12 ఏళ్ళ జైత్రయాత్రకు బ్రేక్ వేస్తూ న్యూజిలాండ్ రోహిత్ సేనకు షాకిచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా… కనీసం పోటీ ఇస్తే చాలన్న రీతిలో కివీస్ పై చాలా మంది మాట్లాడారు. కానీ మైదానంలోకి దిగిన తర్వాత సీన్ రివర్సయింది. మొదట పేస్ పిచ్ తో కివీస్ ను దెబ్బతీద్దామనుకుంటే అదే వ్యూహానికి టీమిండియా బలయింది. అది కూడా కేవలం కేవలం 46 రన్స్ కు కుప్పకూలడంతోనే ఓటమి ఖాయమైంది. పోనీ ఎప్పటిలానే స్పిన్ ఉచ్చుతో ప్రత్యర్థిని తిప్పేద్దాం అనుకుని పుణేలో టర్నింగ్ ట్రాక్ రెడీ చేయించారు. తీరా చూస్తే అదే స్పిన్ ఉచ్చులో మనం చిక్కుకుని అవమానకర ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా స్పిన్ ఆడడంలో తొలిసారి భారత బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేస్తుండడం ఇక్కడ ఆశ్చర్యపరుస్తోంది. ఉపఖండపు జట్లన్నీ స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొంటాయి. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ లాంటి దిగ్గజ స్పిన్నర్లకు సైతం గతంలో మన బ్యాటర్లు చుక్కలు చూపించారు. అలాంటి భారత బ్యాటర్లు స్పిన్ కు పూర్తిగా తలవంచడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ ఓటమికి బాధ్యతు టీమ్ ది ఎంతుందో… కోచ్ గౌతమ్ గంభీర్ దీ అంతే ఉంది.

అదేంటి గ్రౌండ్ లో ఆడేది ఆటగాళ్ళు…వాళ్ళు సరిగ్గా ఆడకుంటే కోచ్ ఏం చేస్తాడనుకోవడానికి లేదు. ఎందుకంటే టీమ్ గెలిచినప్పుడు కాస్తో కూస్తో క్రెడిట్ తీసుకునే కోచ్ పరాజయంలోనూ భాగం పంచుకోవాలి. పైగా తుది జట్టు కూర్పు, పిచ్ వంటి విషయాల్లో కోచ్ కూడా కీలకంగానే ఉంటాడు. పైగా పుణేతో టెస్టుకు ముందు తుది జట్టును సోషల్ మీడియా డిసైడ్ చేయదు.. మాకు ఏం కాంబినేషన్ కావాలో మాకు తెలుసంటూ కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ గానే గంభీర్ మాట్లాడాడు. మరి ఇప్పుడు సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ ఏం చెబుతాడు… నిజానికి గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాతే భారత్ కు రెండు అవమానకర ఓటములు ఎదురయ్యాయి. శ్రీలంక టూర్ తో కోచ్ గా బాధ్యతలు తీసుకున్న గంభీర్ కు టీ ట్వంటీ సిరీస్ విజయంతో మంచి ఆరంభమే దక్కింది. కానీ అదే టూర్ లో వన్డే సిరీస్ మాత్రం చేజారింది. దాదాపు 27 ఏళ్ళ తర్వాత శ్రీలంక మనపై వన్డే సిరీస్ గెలిచింది. అసలు టెస్ట్ మ్యాచ్ గెలిచేందుకు కూడా ఆలోచన చేయని కివీస్ ఏకంగా సిరీస్ ను కైవసం చేసుకుంది.

దీంతో కోచ్ గంభీర్ పై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇది ఐపీఎల్ కాదు టెస్ట్ ఫార్మాట్ అంటూ గుర్తు చేస్తున్నారు. టెస్టుల్లో సుధీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడేలా మన బ్యాటర్లను గంభీర్ సిద్ధం చేయలేకపోతున్నాడంటూ మండిపడుతున్నారు. ఐపీఎల్ , టీ ట్వంటీ మూడు నుంచి బయటకు రావాలంటూ సలహాలు ఇస్తున్నారు. గంభీర్ కోచింగ్ టీ ట్వంటీలకేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేసేలా జట్టును సన్నధ్ధం చేయలేకపోవడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. కేవలం పిచ్ లను మనకు అనుకూలంగా రెడీ చేయించుకుని గెలిచేద్దాం అనుకుంటే అన్నివేళలా కుదరనేది గంభీర్ కు తెలుసు. ఇదే పిచ్ పై మనకంటే కివీస్ బ్యాటర్లు ఎందుకు ఎక్కువ స్కోర్ చేశారు.. మన సొంత పిచ్ లపై భారత బ్యాటర్లు ఎందుకు చేతులెత్తేసారన్నది ఇక్కడ మేజర్ పాయింట్… కివీస్ ను తక్కువ అంచనా వేయడం కాదు గానీ అశ్విన్, జడేజాలతో పోలిస్తే ఆ జట్టు స్పిన్నర్ శాంట్నర్ అంత గొప్ప బౌలర్ ఏమీ కాదు… కానీ పిచ్ నుంచి వచ్చిన సపోర్ట్ ను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెసయ్యాడు. అదే సమయంలో మన బ్యాటర్ల తప్పిదాలు కూడా అతనికి కలిసొచ్చాయి. కివీస్ బ్యాటర్లు ఇదే పిచ్ పై సమయోచితంగా ఆడితే భారత్ మాత్రం మరీ డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళి వికెట్లు ఇచ్చుకుంది. ఫలితంగానే ఈ ఘోరపరాభవం ఎదురైంది. ఇప్పటి కైనా కోచ్ గంభీర్ ఈ రెండు టెస్టుల ఓటముల తప్పిదాలపై ఫోకస్ పెట్టి క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకునేలా జట్టును సిద్ధం చేయాలి. లేకుంటే ఆసీస్ పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం అటుంచితే కనీస పోటీ ఇవ్వడం కూడా డౌట్ గానే ఉంటుంది.