అశ్విన్ కు ఇది అవమానమే కావాలనే తప్పించారంటున్న ఫ్యాన్స్

రవిచంద్రన్ అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్ ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది. గొప్ప స్పిన్నర్ గా , మ్యాచ్ విన్నర్ గా గుర్తింపు ఉన్న అశ్విన్ ఇలా హఠాత్తుగా రిటైర్మెంట్ ఇస్తాడని ఎవ్వరూ అనుకోలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2024 | 03:10 PMLast Updated on: Dec 19, 2024 | 3:10 PM

Fans Say This Was Deliberately Avoided As An Insult To Ashwin

రవిచంద్రన్ అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్ ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది. గొప్ప స్పిన్నర్ గా , మ్యాచ్ విన్నర్ గా గుర్తింపు ఉన్న అశ్విన్ ఇలా హఠాత్తుగా రిటైర్మెంట్ ఇస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఒక దిగ్గజ స్థాయి ఆటగాడికి వీడ్కోలు సమయం దక్కే గౌరవం దక్కలేదనేది కూడా చర్చనీయాంశమైంది. అతను తప్పుకోలేదని, బలవంతంగా తప్పించారంటూ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గబ్బా టెస్టు ఐదో రోజు విరాట్ కోహ్లీ పక్కన కూర్చొని చాలా సేపు మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్, అతనితో రిటైర్మెంట్ గురించి చెప్పాడు. దీంతో షాకైన విరాట్ కోహ్లీ, అశ్విన్‌ని కౌగిలించుకున్నాడు. ఈ వీడియో చూడగానే రిటైర్మెంట్ ప్రకటన రావచ్చని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే అశ్విన్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు.

అయితే సిరీస్ మధ్యలో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటనే దానిపై కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో చెప్పేశాడు. టీమ్‌కి తాను అవసరం లేనప్పుడు.. తప్పుకోవడమే మంచిదని అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రోహిత్ చెప్పాడు. 2021 ఇంగ్లాండ్ టూర్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ నాలుగు టెస్టులు ఆడింది . ఈ నాలుగు టెస్టుల్లోనూ అశ్విన్ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అశ్విన్ ప్లేస్‌లో జడ్డూ ఒక్కడే ఆడాడు. టీమ్ నుంచి తప్పించారని ఫీలై, రిటైర్మెంట్ ఇచ్చి ఉంటే.. మరి అప్పుడు అశ్విన్ నుంచి ఇలాంటి ప్రకటన ఎందుకు రాలేదన్నది ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో యాష్ ఆల్‌రౌండ్ పర్పామెన్స్ ఇచ్చాడు. బ్యాటింగ్‌లో ఓ సెంచరీ బాదడంతో పాటు బౌలింగ్‌లో 11 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచాడు. సెప్టెంబర్‌కీ, డిసెంబర్‌కీ మధ్య రెండు నెలల్లో ఏం మారిపోయిందంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్, టీమిండియాపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపించింది. అశ్విన్- జడేజా న్యూజిలాండ్‌ని ఇబ్బంది పెట్టలేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమికి రవిచంద్రన్ అశ్విన్‌ని ప్రధాన బాధ్యుడిని చేస్తూ రోహిత్ శర్మ మాట్లాడడం కూడా అప్పట్లో సంచలనమైంది. జడేజా ఈ సిరీస్‌లో 16 వికెట్లు తీయడంతో పాటు ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అశ్విన్ మాత్రం 9 వికెట్లు మాత్రమే తీసి, బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయాడు.. ఒకే ఒక్క సిరీస్ ఫెయిల్యూర్, అశ్విన్ రిటైర్మెంట్ కు కారణమైందంటూ ఎక్స్ పర్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా వచ్చాక జట్టులో పరిస్థుతులన్నీ మారాయి, జట్టులో అశ్విన్‌కి విలువ తగ్గింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వచ్చిన ఫెయిల్యూర్‌, ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ నుంచి సరైన సపోర్ట్ దక్కకపోవడం వల్ల అశ్విన్, ఇలా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ఇచ్చేసి ఉండొచ్చన్నది కొందరి అభిప్రాయం. ఏదీ ఏమైనా ఒక గొప్ప మ్యాచ్ విన్నర్ కు రిటైర్మెంట్ సమయంలో దక్కే గౌరవం దక్కకపోవడం చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కు బాధ కలిగిస్తోంది.