Divorce Celebrations: మెట్టింట్లో కూతురికి వేధింపులు.. పుట్టింటికి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చిన తండ్రి
సాధారణంగా ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు మేళ తాళాలతో, టపాసుల మోతతో ఘనంగా నిర్వహించుకుంటారు. కానీ అత్తారింట్లో వేధింపులకు గురైన ఆడబిడ్డని తన తండ్రి ఇలా ఊరేగింపుగా తీసుకురావడం ఆసక్తిగా రేపుతోంది.
తండ్రి పేరు ప్రేమ్ గుప్తా.. ఈయన ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నివసిస్తున్నారు. ఇతనికి ఒక్కతే కుమార్తె. గత ఏడాది సచిన్ కుమార్ అనే వ్యక్తితో వివాహం ఘనంగా వివాహం జరిపించారు. వివాహమైన తరువాత అత్తారింటికి వెళ్లిపోయింది సాక్షి గుప్తా. పెళ్లైన కొన్ని రోజులకే అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. అన్నింటినీ సహిస్తూ భరించింది. ఇలా సాగుతున్న వైవాహిక జీవితంలో సచిన్ కుమార్ గురించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తనకంటే ముందే మరొకరితో వివాహమైన విషయాన్ని తెలుసుకుంది సాక్షి. అయినప్పటికీ అతనితోనే బంధాన్ని కొనసాగించాలని నిశ్చయించుకుంది.
ఈ క్రమంలో అత్త నుంచే కాకుండా భర్త నుంచి కూడా వేధింపులు ఎక్కువయ్యాయి. సచిన్ తో కలిసి ఉండటం తనవల్ల కాదని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఈ వైవాహిక జీవితానికి స్వస్థి చెప్పాలనుకుంది. ఈ చేదు విషయాన్ని ముందుగా తన తల్లిదండ్రులతో పంచుకుంది. ఈ విషయాన్ని విన్న సాక్షి తండ్రి తన హుందాతనాన్ని ప్రదర్శించారు. పెళ్లి చేసేశాను ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇష్టమైనా కష్టమైనా అక్కడే ఉండు అనలేదు. పెళ్లి ఎంత ఘనంగా చేశారో అంతే ఘనంగా తన కుమార్తెను పుట్టింటికి పిలిపించేందుకు సిద్దమయ్యారు. ఈ విషయం సాక్షితో సహా తమ బంధువులకు చెప్పారు. దీనిని స్వాగతించిన కుటుంబీకులు ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.
ఆ తరువాత సచిన్ కుమార్ తో విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి డివొర్స్ పిటిషన్ దాఖలు చేశారు. కుమార్తెలు చాలా విలువైన వారు, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే గౌరవంగా పుట్టింటికి పిలిపించుకోవాలని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. తండ్రి ప్రేమ్ గుప్తా చేసిన ఈ ఊరేగింపును వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
T.V.SRIKAR