కివీస్ తో చివరి టెస్ట్ హర్షిత్ రాణాకు పిలుపు

న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకునేందుకు రెడీ అవుతోంది. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి జరగనున్న చివరి టెస్టుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 29, 2024 | 06:59 PMLast Updated on: Oct 29, 2024 | 6:59 PM

Final Test With Kiwis A Call To Harshit Rana

న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకునేందుకు రెడీ అవుతోంది. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి జరగనున్న చివరి టెస్టుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఊహించని విధంగా జట్టులోకి మరో పేసర్ ను ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీ ఆడుతున్న హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది. మూడో టెస్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రాకు విశ్రాంతినిస్తారన్న వార్తల నేపథ్యంలో హర్షిత్ రాణా ఎంపిక ఆసక్తికరంగా మారింది. తుది జట్టులో మార్పులు జరగనుండడంతో హర్షిత్ రాణా అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. సిరాజ్, ఆకాశ్ దీప్ పేసర్లుగా ఉన్నప్పటకీ హర్షిత్ రాణాను కూడా తుది జట్టులో ఆడించడంపై గంభీర్ ఆలోచనగా కనిపిస్తోంది. పైగా రంజీ ట్రోఫీలో రాణా ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. ఈ ఢిల్లీ పేసర్ అస్సాంతో మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాదు రెండో ఇన్నింగ్స్ లోనూ 2 వికెట్లు తీశాడు.

ఫలితంగా ఈ మ్యాచ్ లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ప్రదర్శనతోనే సెలక్టర్లు చివరి నిమిషంలో మూడో టెస్టుకు అతన్ని జట్టులోకి పిలిపించారు. బూమ్రాకు రెస్ట్ ఇవ్వనుండగా… హర్షిత్ రాణా తుది జట్టులోకి రావడం ఖాయమైనట్టేనని చెప్పొచ్చు. ఇటీవల ఆసీస్ టూర్ కోసం ప్రకటించిన జట్టులోనూ హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నాడు. అక్కడి పేస్ పిచ్ లపై రాణాను బ్యాకప్ బౌలర్ గా సెలక్ట్ చేశారు. కాగా ఆసీస్ టూర్‌కు హర్షిత్ రాణా ఎంపికకు కారణం కోచ్ గౌతమ్ గంభీరే…. కా ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లో కేకేఆర్ మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించిన గంభీర్‌ రాణాా అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను దగ్గరుండి చూశాడు. మొత్తం ఈ ఏడాది సీజ‌న్‌లో 19 వికెట్లు ప‌డ‌గొట్టిన హ‌ర్షిత్ రానా.. కోల్ కత్తా తరపున లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు రానాకు భార‌త సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. కానీ వైర‌ల్ ఫీవ‌ర్ కార‌ణంగా బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇప్పుడు ఏకంగా ప్ర‌తిష్టాత్మ‌క బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీకి ఎంపికయ్యాడు.

ఆ సిరీస్ కంటే ముందే హర్షిత్ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. గత మూడు నెలలుగా హర్షిత్ కొన్ని ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించేందుకు హర్షిత్‌ రాణా 17 కిలోల మేర బరువు తగ్గాడు. కఠిన సవాళ్లను అధిగమిస్తూ టీమిండియాకు ఎంపికయ్యాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా ఇప్పుడు మహ్మద్‌ షమీ ఫిట్ నెస్ సాధించకపోవడంతో ఆస్ట్రేలియా టూర్‌ కోసం రాణాకు చోటు దక్కింది. హర్షిత్ రాణాను కేవలం బౌలర్ గానే గంభీర్ ఎంపిక చేయలేదని తెలుస్తోంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో సత్తాచాటుతాడనే ఆలోచనతోనే తీసుకున్నట్టు సమాచారం. దులీప్ ట్రోఫీలో టెయిలెండర్‌గా వచ్చి సిక్సర్లు మోత మోగించిన హర్షిత్‌ తాజాగా రంజీ ట్రోఫీలోనూ హాఫ్ సెంచరీ చేయడంతో గంభీర్ అంచనాలు నిజమయ్యాయి.